ఆయిల్‌ పాం సాగువైపు అన్నదాతలు | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పాం సాగువైపు అన్నదాతలు

Published Wed, Mar 27 2024 12:05 AM

మొక్కపై మందు పిచికారీ చేస్తున్న రైతు
 - Sakshi

● జిల్లాలో ఇప్పటికే నాలుగు వేల ఎకరాల్లో సాగు ● ఈ ఏడాది మరింత పెరగనున్న విస్తీర్ణం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఆయిల్‌ పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2022–23లో 1832 ఎకరాల్లో సాగు చేపట్టిన రైతులు.. 2023–24లో 8,800 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించినా.. నర్సరీలో ఏడాది వయస్సున్న మొక్కలు అందుబాటులో లేకపోవడంతో 2200 ఎకరాల్లో మాత్రమే పరిమితం అయ్యారు. ఈ ఏడాది కూడా అత్యధిక విస్తీర్ణంలో సాగు చేపట్టేలా ఉద్యానశాఖ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆయిల్‌ పాం సాగుకు జిల్లా వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఉద్యానశాఖ సమాయత్తమవుతోంది.

గొల్లపల్లి నర్సరీలో మొక్కలు

జిల్లాకు మొక్కలు సరఫరా చేసే లోహియా ఎడిబుల్‌ ఆయిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌లో నర్సరీని ఏ ర్పాటు చేసింది. ఈ మేరకు, నర్సరీలో జూన్‌ వరకు దాదాపు 3 లక్షల మొక్కలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. ఆయిల్‌ పాం సాగుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే నర్సరీ నుంచి మొక్కలు సరఫరా చేస్తున్నారు. లక్ష్యం పూర్తయ్యే వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెపుతున్నారు.

రైతులకు లాభం

రైతులకు సబ్సిడీపై మొక్కలు సరఫరా చేస్తారు. ప్రభుత్వమే రేటు నిర్ణయించి ఆయిల్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం టన్నుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ధర ఉంది. ఎకరాకు 8 నుంచి 10టన్నుల దిగుబడి రానుంది. పంటను సాగు చేసే రైతులకు డ్రిప్‌ ఇవ్వనున్నారు. నాలుగేళ్ల పాటు తోట నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తారు. పంటకు కోతులు, పిట్టలు, అడవిపందుల బెడద ఉండదు. తెగుళ్లు సోకే అవకాశం తక్కువ. రసాయన ఎరువులు పెద్దగా అవసరం ఉండదు. ఎకరాకు ఏటా రూ.80వేల నుంచి రూ.లక్ష ఆదాయం వచ్చె అవకాశం ఉంది.

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

ఆయిల్‌ పాం సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. మొదటి, రెండో ఏడాది సాగు చేసిన ఆయిల్‌ పాం తోటలు బా గున్నాయి. మూడో ఏడాది సాగు చేసేందుకు చాలామంది రైతులు ముందుకొస్తున్నారు.

– ప్రతాప్‌సింగ్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి

1/1

Advertisement
Advertisement