టూల్‌కిట్‌ వివాదం: పాక్‌ కీలక వ్యాఖ్యలు

Pakistan PM Imran Khan Extend Support To DIsha Ravi - Sakshi

భారత ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక  ఉద్యమకారిణి దిశ అరెస్ట్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అంతర్జాతీయ పర్యవరణ యాక్టివిస్ట్‌ గ్రెటా థన్‌బర్గ్‌తో ముడిపడి ఉన్న టూల్‌కిట్‌ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు దిశరవిని ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇదే కేసుకు సంబంధించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశ అరెస్ట్‌ను దేశ వ్యాప్తంగా ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పౌరుల భావప్రకటన స్వేచ్ఛను పాలకులు హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిశ అరెస్ట్‌ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టిన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌‌ ఓ టూల్‌కిట్‌ను షేర్‌ చేశారు. అయితే ఈ టూల్‌కిట్‌ వెనుక తజకిస్తాన్‌  ఉగ్రవాదులు ఉన్నారనేది ఢిల్లీ పోలీసులు అనుమానం. ఈ క్రమంలోనే గ్రెటా టూల్‌కిట్‌తో సంబంధముందని ఆరోపణలు ఎందుర్కొంటున్న పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగానే బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశా రవి అప్‌లోడ్‌ చేశారు. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

దిశరవికి పాకిస్తాన్‌ మద్దతు..
ఈ క్రమంలో భారత్‌లో సామాజిక కార్యకర్తల అరెస్ట్‌పై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీ‌క్ ఈ‌‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సామాజిక ఉద్యమకారిణి దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రంలోని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్కార్‌ పౌరులు హక్కులను కాలరాస్తోంది. కశ్మీర్‌ విభజనతో మైనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది. దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇండియా హైజాక్‌ ట్విటర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది. దిశరవికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని పాక్‌ తెలిపింది. కాగా భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ తల దూర్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసి వివాదాన్ని మరింత రాజేసింది. 

.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top