వావ్‌..ఆ పల్లెటూరు బ్యూటిఫుల్

Architectect Erik Mygind Build Brand By Garden City In Denmark - Sakshi

పచ్చని పంటలు, పాడి పశువులు, కల్మషమెరుగని మనుషులతో ఉండే పల్లెటూళ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పట్నవాసాల్లో బిజీబిజీగా జీవితాలు గడిపేవారు పచ్చని పరిసరాలను చూసి మనసుపారేసుకోకుండా ఉండరు. అసలు ఇండోనేసియాలోని ఓ పల్లెటూరును, డెన్మార్క్‌లోని మరో పట్నాన్ని చూస్తే వావ్‌.. వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ అనకుండా ఎవరూ ఉండలేరేమో.!

అచ్చం బండి చక్రంలా..
డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగాన్‌ ఆనుకుని ఉన్న బ్రాండ్బీ హేవ్‌బీ నగరంలోని ప్లాట్ల లేఅవుట్‌ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. చక్రం ఆకారంలోని లేఅవుట్‌లో, ఆకుపచ్చని పరిసరాల మధ్య ఉన్న ఇళ్లను చూసి భలే ముచ్చటపడిపోతారు. పురాతన డానిష్‌ గ్రామాల నమూనాతో ఈ ప్రాంతాన్ని 1964లో ఎరిక్‌ మైగిండ్‌ అనే ఆర్కిటెక్ట్‌ అభివృద్ధి చేశాడు. అచ్చం ఎడ్లబండి చక్రంలా ఉండే లేఅవుట్‌లో ఇళ్లను నిర్మించారు. ఇలాంటి పలు చక్రాలతో ఓ పట్టణాన్నే సృష్టించారు.

చక్రం లేఅవుట్‌ చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. మధ్యలో ఇరుసులాంటి ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ఆర్కిటెక్టులు చెబుతున్నారు. ఇళ్ల మధ్య కాంపౌండ్‌ వాల్‌ను కూడా మొక్కలతోనే నిర్మించారు. ఈ లేఅవుట్‌ను ఇటీవల హెండ్రీ డో అనే ఫొటోగ్రాఫర్‌ డ్రోన్‌ సాయంతో ఫొటోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో ఉంచాడు. దీంతో ఈ ఇళ్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

సంప్రదాయల ఊరు
ఇండోనేసియా, బాలి దీవుల్లో ఉన్న పెంగ్లిపురన్‌ గ్రామంలో పురాతన సంప్రదాయాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఇళ్ల సముదాయం, వ్యవసాయ ఆధారిత గ్రామం. ఆధునికతకు దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆ ఊరు విలసిల్లుతోంది. అసలు ఆ ఊరిలోకి మోటార్‌ సైకిల్‌కు కూడా అనుమతి ఉండదు అంటే నమ్మలేం కదా?. అందమైన రహదారులు, వాటిని ఆనుకుని వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు, రోడ్డుకు ఆనుకుని అందమైన పూల మొక్కలు, పురాతన సంప్రదాయ రీతిలో పెంకులతో నిర్మితమైన ఇళ్లు.. ఆ వీధుల్లో నుంచి నడుచుకుంటూ వెళితే, అసలు మనం ఈ లోకంలోనే ఉన్నామా అనే భావన కలుగుతుంది. ప్రపంచంలో క్లీన్‌ విలేజ్‌గా ఈ ఊరికి పేరుంది. పెంగ్లిపురన్‌ అంటే పూర్వీకులను గుర్తు చేసే ఊరు అని అర్థమట. చాలా మంది ఇక్కడికి వచ్చి తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

బాలి ప్రాంతంలోని హిందూ సంప్రదాయం ప్రకారం గ్రామ నిర్మాణం ఉంటుంది. పర్యాంగన్‌ (పుణ్యకార్యక్రమాలు జరిగే ప్రాంతం), పవోంగన్‌ (నివేశన స్థలం), పాలేమహన్‌ (శ్మశానం, సాగుభూమి తదితర కార్యకలాపాలు) ప్రాంతాలుగా గ్రామ నిర్మాణం జరిగింది. గ్రామంలో లభించే వెదురు, కలప, రాళ్లతోనే ఇళ్లను నిర్మించారు. ఏడు వందల మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఏటా వేల సంఖ్యలో వస్తారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top