అభివృద్ధే ఎజెండా | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ఎజెండా

Published Wed, May 8 2024 10:15 AM

అభివృ

మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

నాకు ప్రత్యర్థులు ఎవరూ లేరు

రేవంత్‌రెడ్డి అయిదేళ్లు ఏమీ చేయలేదు

మోదీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తాం

ఫ్లై ఓవర్‌ బ్రిడ్జీలు, ఆర్‌ఓబీలు ఏర్పాటు చేయిస్తాం

ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అవసరం ఎంతో ఉంది

మేనిఫెస్టోను ప్రజల ముందుంచాం..

మేం అధికారంలోకి వస్తే స్థానికంగా ఏం చేస్తామనేది ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసి ప్రజల ముందుంచాం. ఐటీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై మాకు స్పష్టమైన ఎజెండా ఉంది. నగరం విస్తరిస్తుండడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతర్గత రహదారులు, ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, ఆర్‌.ఓ.బీలు ఏర్పాటు చేయిస్తాం. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అవసరం ఉంది. మురుగుకూపంగా మారిపోయిన జవహర్‌నగర్‌ను సరికొత్తగ తీర్చిదిద్దుతాం.

మార్ఫింగ్‌ వీడియోలను ప్రజలు నమ్మరు

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించి, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో నేను అనని మాటలను అన్నట్లు వీడియోలను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు లోకల్‌ నాన్‌లోకల్‌తో సంబంధం లేదు. వాళ్లను కష్టంలో ఆదుకునే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు.

మతపరమైన రిజర్వేషన్ల రద్దుతో నష్టం లేదు..

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దని మాత్రమే బీజేపీ అంటోంది. సుమారు 50 శాతం మంది ముస్లింలు బీసీ–ఈ లో ఉన్నారు. ఆపై ఈబీసీ కోటా 10 శాతంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఇంకా నష్టం జరిగేది ఎవరికి? మేము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అదంతా రాజకీయ లబ్ధి కోసం తప్ప ముస్లింలపై ప్రేమతో కానే కాదు.

మల్కాజిగిరికి రేవంత్‌ ఏమీ చేయలేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక అని ప్రచారం చేసుకుంటే మల్కాజిగిరి ప్రజలు ఆదరించారు. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. చేసింది చెప్పుకోలేక తప్పుడు వాగ్దానాలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌పై వ్యతిరేకత రావడానికి చాలా సమయం పట్టింది. రేవంత్‌రెడ్డిని కేవలం 4 నెలల్లోనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయాలన్న అడ్డంకిగా మారుతోంది. వీలయితే ఇక్కడి నుంచి కంటోన్మెంట్‌ను పూర్తిగా ఎత్తేయడం లేదా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఉంది.

దేశ రక్షణ, అభివృద్ధి కోరుకుంటున్నారు.

ప్రజలు దేశ రక్షణ, అభివృద్ధిని కోరుకుంటున్నారు. అది మోదీతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు. మల్కాగిజిరిలో నేను గెలవడం, దేశంలో మోదీ మూడోసారి ప్రధాని కావడం తథ్యం.

‘ఈ ఎన్నికల్లో నాకు సమీప ప్రత్యర్థులు ఎవరూ లేరు. గేటెడ్‌ కమ్యూనిటీ నుంచి బస్తీ వరకు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రత్యర్థులు ఎన్ని మార్ఫింగ్‌ వీడియోలు విడుదల చేసినా.. అవాస్తవాలు ప్రచారం చేసినా ఓటర్లు నమ్మే పరిస్థితిలో లేరు. నేనేంటో గత 24 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దేశంలో మోదీ పాలన రావాలని.. బీజేపీని గెలిపించాలని ఓటర్లు బలంగా కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని బస్తీలు చుట్టేశాను. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాను. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు, చెరువులు, ఇతర ప్రభుత్వ స్థలాల కబ్జాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తా’నంటున్నారు ఆయన. ‘సాక్షి’తో ఈటల రాజేందర్‌ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..

– సాక్షి, సిటీ బ్యూరో

I N T E R V I E W

అభివృద్ధే ఎజెండా
1/1

అభివృద్ధే ఎజెండా

Advertisement
Advertisement