వైభవం.. ధ్వజారోహణం | Sakshi
Sakshi News home page

వైభవం.. ధ్వజారోహణం

Published Mon, May 20 2024 3:50 AM

వైభవం

చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వేడుక

ద్వారకాతిరుమల: సహస్ర నామాలతో భక్తజన నీరాజనాలు అందుకునే శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ.. ఆదివారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వేడుక భక్తజనకోటికి కనుల పండువైంది. వైఖానస ఆగమ యుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులు, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అర్చకులు ఎగురవేశారు. ఆద్యంతం ఈ వేడుక భక్తులను పరవశింపజేసింది. ఉదయం ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి జరిగింది. అనంతరం సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాత్రి జరగాల్సిన హంస వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది.

అంకురార్పణ జరిగిందిలా..

సాయంత్రం ఆలయంలో విష్వక్సేనుని ఒక వాహనంపై ఉంచి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అర్చకులు పుట్టమన్నును తెచ్చారు. ఆలయ ఆవరణలో అంతక ముందు ఏర్పాటు చేసిన పాలికల్లో ఈ పుట్టమన్నును ఉంచి వేద మంత్రోచ్ఛరణలతో నవధాన్యాలను పోసి అంకురార్పణ జరిపారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ధ్వజారోహణను అర్చకులు వైభవంగా జరిపి శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వదేవతలను ఆహ్వానించే దిశగా గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణను నిర్వహించారు. అర్చకులు పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని మహిళలు అందుకున్నారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారన్నది నమ్మకం.

కాళీయ మర్దనుడిగా శ్రీవారు

ఆలయ ముఖ మండపంలో శ్రీవారు కాళీయ మర్దనం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాళింది మడుగులో కాళీయుడు అనే సర్ప మదాన్ని అణచే విధంగా ఉన్న ఈ అలంకారం భక్తులకు కనువిందు చేసింది.

బ్రహ్మోత్సవాల్లో నేడు

● ఉదయం 7 గంటల నుంచి – సూర్యప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ

● ఉదయం 7 నుంచి – భజన కార్యక్రమాలు

● ఉదయం 8 గంటల నుంచి – బుర్రకథ

● ఉదయం 9 గంటల నుంచి – భక్తిరంజని

● ఉదయం 11 నుంచి – కూచిపూడి భరతనాట్యం

● సాయంత్రం 4 నుంచి – నాదస్వర కచేరి

● సాయంత్రం 5 గంటల నుంచి – కూచిపూడి భరతనాట్యం

● రాత్రి 7 గంటల నుంచి – చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీది సేవ

● రాత్రి 8 గంటల నుంచి – నాటకం

శ్రీవారి ప్రత్యేక అలంకారం : యోగ శ్రీనివాసుడు

వైభవం.. ధ్వజారోహణం
1/2

వైభవం.. ధ్వజారోహణం

వైభవం.. ధ్వజారోహణం
2/2

వైభవం.. ధ్వజారోహణం

Advertisement
 
Advertisement
 
Advertisement