
ప్రతి ఏడాది జూన్‌లో పాఠశాలలు మొదలవుతాయి. పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు కొనడంలో తల్లిదండ్రులు దుకాణాల వద్ద బిజీగా ఉంటారు. కాని, ఈ హడావుడిలో మర్చిపోయే విషయం ఒక్కటే– ‘స్కూలుకు బిడ్డ మనసు సిద్ధంగా ఉందా లేదా?’వేసవి సెలవుల సరదాను వదిలి బయటకు రావడం, కొత్త క్లాసులో కొత్త టీచర్లు ఎలా ఉంటారో? అనే ఆందోళన, మళ్లీ మార్కుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం చిన్నారుల మనసులో ఆందోళన రేకెత్తిస్తుంటాయి.
పిల్లలు భయపడ్డప్పుడు వారి మెదడులోని అమిగ్డాలా (భయ కేంద్రం) తీవ్రంగా స్పందిస్తుంది. అది వారు నిర్ణయం తీసుకునే, జ్ఞాపకాలను నిలుపుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను బంధించి వేస్తుంది. ఫలితంగా వారి మెదడు కొత్త విషయాలను గ్రహించలేదు.
భావోద్వేగ భద్రత ఉన్న పిల్లలు మాత్రమే చదువులో, స్వభావంలో, జీవిత గమ్యంలో ముందుకు వెళ్లగలుగుతారని ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలోని డెవలపింగ్ చైల్డ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం ఈ ఐదు సూత్రాలను పాటించండి...
1. వాళ్ల భయాలను గౌరవించండి
కొత్త విషయాలు మొదలయ్యేప్పుడు భయపడటం సర్వసాధారణం. అది తప్పు కాదు. భావోద్వేగాలను పేరు పెట్టి పలకడం వల్ల మెదడులోని ఎమోషనల్ కేంద్రం శాంతిస్తుందని డాక్టర్ డ్యాన్ సీగల్ చెప్పారు. అందుకే స్కూల్ గురించి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టండి.
∙‘‘ఈసారి స్కూలుకు సంబంధించి ఏది బాగా నచ్చింది?’’
∙‘‘ఏమైనా భయంగా ఉందా?’’
∙‘‘ఈసారి నిన్ను నీవు ఎలా మెరుగుపరచు కోవాలని అనుకుంటున్నావు?’’
2. ఉదయాల్ని రణరంగం చేయకండి
ప్రతిరోజూ ఉదయం ‘‘త్వరగా లే! బ్రష్ చేయి! బస్ మిస్ అవుతాం!’’ అని అరవకండి. ఇంటిని రణరంగంగా మార్చకండి. పిల్లల నెర్వస్ సిస్టమ్‌ను శాంతంగా ఉంచేందుకు ఈ చిట్కాలు ఉపయోగించండి.
లైట్ మ్యూజిక్ ప్లే చేయండి
రెండు నిమిషాలు పక్కన కూర్చుని, ప్రేమను పంచండి.
‘‘ఈరోజు నీ స్టైల్‌లో మెరిసిపోతావ్’’ అని సానుకూల వాక్యాన్ని పలకండి.
3. పాత ఫ్రెండ్స్ ను రీకనెక్ట్ చేయండి
‘‘మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుకుంటారా?’’, ‘‘ఎవరైనా తోడు ఉంటారా?’’ అనేదే పిల్లలకు ముఖ్యమైన భయం. ఈ భయాన్ని అధిగమించేందుకు ఈ పనులు చేయండి. ఇవి వారి మెదడులో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. భావోద్వేగ భద్రతను పెంపొందిస్తుంది.
స్కూల్ మొదలయ్యే ముందు ఒక ప్లే డేట్ ఏర్పాటు చేయండి
ఒకరిద్దరు క్లాస్‌మేట్లతో ఫోన్ ద్వారా మాట్లాడనివ్వండి
క్లాసులో నడిచే కొన్ని సన్నివేశాలను రోల్ ప్లే చేయండి
4. భావోద్వేగ లక్ష్యాలు కూడా పెట్టండి
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ‘‘ఎన్ని మార్కులు వస్తాయి?’’ అని అడుగుతుంటారు. దీనికి బదులుగా భావోద్వేగ లక్ష్యాలను పెట్టండి. అది పిల్లల్లో అంతర్గత ప్రేరణను పెంచుతాయి.
‘‘ఈ సంవత్సరం నువ్వు ఎలా అనిపించుకోవాలని అనుకుంటున్నావు?’’
‘‘ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావు?’’
‘‘నీ గురించి నువ్వు గర్వపడేలా ఏం చేస్తావు?’’
5. మీ స్కూల్ అనుభవాలను పంచుకోండి
మీరు కూడా స్కూలుకు వెళ్లేటప్పుడు భయపడ్డారని చెప్పండి. ఉదాహరణకు:‘‘ఒకసారి టీచర్ నన్ను బాగా కొట్టింది. అప్పట్లో చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ సంఘటన వల్ల నేను మరింత మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నాను’’ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల బిడ్డ ‘‘నా భావోద్వేగాలు తప్పు కావు’’అన్న భద్రతను పొందుతాడు.
ప్రతి రోజు అడగాల్సిన మూడు ప్రశ్నలు
మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ప్రతిరోజూ ఈ మూడు ప్రశ్నలూ అడగండి. ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ పరిణతిని, అనుబంధాన్ని పెంచుతాయి.
1. ‘‘ఈ రోజు నీకు ఏం నచ్చింది?’’
2. ‘‘ఏదైనా బాధించిందా?’’
3. ‘‘ఏ విషయం పట్ల నీకు గర్వంగా అనిపించింది?’’చేయకూడనిమూడు పొరపాట్లు
1. ‘‘అన్నయ్య/చెల్లెలు ఎలా టాపర్ అయ్యారో చూడు!’’ అంటూ పోల్చవద్దు. ఇది అవమానాన్ని కలిగిస్తుంది.
2. ‘’90 శాతం మార్కులొస్తే ఫోన్ కొనిస్తా’’ అని చెప్పొద్దు. ఇది పిల్లల్లో బాహ్య ప్రేరణను పెంచుతుంది. బహుమతుల కోసమే చదవడం అలవాటవుతుంది.
3. పిల్లలను అతి ఎక్కువ ట్యూషన్లతో నింపొద్దు. వారిలో మానసిక అలసట పెరుగుతుంది.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: ఆ చేదు అనుభవమే స్టార్టప్‌గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..)