నా భర్తపై నాకు ఫీలింగ్స్‌ రావడం లేదు | Gender dysphoria is a feeling of distress a person gender identity | Sakshi
Sakshi News home page

నా భర్తపై నాకు ఫీలింగ్స్‌ రావడం లేదు

Aug 27 2026 8:32 AM | Updated on Aug 27 2026 9:20 AM

Gender dysphoria is a feeling of distress a person gender identity

నాకు ముప్పై రెండు ఏళ్లు. నేను పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి నేను అమ్మాయిని కాదని, అబ్బాయినేమో అని అనుమానమే కాదు, నమ్మకం కూడా! అబ్బాయిలాగా బట్టలు వేసుకునేదాన్ని. అలాగే బైక్‌లు నడిపేదాన్ని. రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండేదాన్ని. అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద ఆకర్షణ ఉండేది కాదు. అయితే నా పేరెంట్స్‌ నేనేదో సరదాగా ఉంటున్నానని అనుకునేవారు. నా బీటెక్‌ పూర్తయిన తర్వాత నా ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో నాకు స్నేహం ఏర్పడింది. ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఈ క్రమంలో మేమిద్దరం ‘బాగా క్లోజ్‌’ అయ్యాం. కొంతకాలం తర్వాత అమ్మాయి వాళ్ల ఇంట్లో వాళ్ల బలవంతం మీద పెళ్లి చేసుకుంది. 

తనలాగే నన్ను కూడా అమ్మానాన్న చెప్పినట్టు విని పెళ్లి చేసుకోమని పోరు పెట్టడమే కాదు, వాళ్ల చుట్టాలలో ఒక అబ్బాయిని చూసి నాకు పెళ్లి కూడా చేసింది. అయితే ఎంత ప్రయత్నం చేసినా, నా భర్తపై నాకు  ఫీలింగ్స్‌ నాకు రావడం లేదు. ఈ మధ్యకాలంలో మా ఆఫీసులో పనిచేసే మరో అమ్మాయి మీద మళ్లీ నాకు ఇష్టం కలిగింది. నా ఫీలింగ్స్‌ను నేను ఆ అమ్మాయికి చెప్పాను. కానీ తను నన్ను బాగా తిట్టి దూరం పెట్టింది. దాంతో అసలు ఈ భూమ్మీద పుట్టడమే నేను చేసిన తప్పేమో అని అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా చెప్పండి!     
   – కావ్య, చెన్నై

మీరు పడుతున్న ఈ మనోవేదనను నేను అర్థం చేసుకోగలను. అన్నింటికంటే ముందు మీరు ఈ భూమ్మీద పుట్టడమే నేను చేసిన తప్పా అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోవద్దు. మీలోని ఆలోచనలు, మీ లైంగిక ఆకర్షణ పూర్తిగా సహజమైనవి. అందులో ఏమాత్రం తప్పు లేదు, అది జబ్బు అంతకన్నా కాదు. ముందుగా మీ మనసులో ఉన్న సందేహాన్ని స్పష్టం చేసుకుందాం. చిన్నప్పటి నుంచి అబ్బాయిలా బట్టలు వేసుకోవడం, బైక్స్‌ నడపడం కేవలం మీ అలవాట్లు లేదా ఇష్టాలు మాత్రమే అయివుండి, మీ ఆకర్షణ కేవలం అమ్మాయిల మీదే ఉంటే దానిని స్వలింగ ఆకర్షణ అంటారు.

 అలా కాకుండా ‘నేను అసలు అమ్మాయినే కాదు, పొరపాటున అమ్మాయిగా పుట్టాను అనిపించి, మీ శరీరాన్ని అబ్బాయిలా మార్చుకోవాలని అనిపిస్తే దానిని ‘జెండర్‌ డిస్ఫోరియా’ అంటారు. ఇవేమీ అసాధారణమైనవి కాదు. కాకపోతే మన సమాజం ఇంకా ఇలాంటి విషయాలను అర్థం చేసుకునేంతగా పరిణతి చెందలేదు, అదే మీలాంటి వారికి పెద్ద సవాలుగా మారింది. ఇక మీ పెళ్లి విషయానికి వస్తే, మీ ఫ్రెండ్‌ చెప్పిన మాటల వల్ల ఎమోషనల్‌ అయి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇష్టం లేని బంధంలో ఉంటూ మీ భర్త పట్ల ఫీలింగ్స్‌ రాలేదని బాధపడటంలో అర్థం లేదు, ఎందుకంటే అది మీ సహజ స్వభావానికి విరుద్ధం. 

జరిగిన దానికి మీ మీద మీరు గిల్ట్‌ పెంచుకోకండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మొదటగా మీలోని డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడటానికి వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్‌ లేదా కౌన్సెలర్‌ను కలవండి. మనసు కొంచెం కుదుటపడ్డాక, మీ భర్తతో కూర్చుని లేదా కౌన్సెలర్‌ సమక్షంలో నిజాయితీగా మాట్లాడండి. ఇద్దరి జీవితాలు నరకం కాకుండా ఉండటానికి ఒక స్పష్టమైన, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా, ధైర్యంగా అడుగులు వేస్తే మీకంటూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. ఆల్‌ ది బెస్ట్‌ !

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 

మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement