వర్తమానమే భవితకు ప్రాణం

Sakshi Editorial On Children Education Due To The Covid 19

బాలల వర్తమానం నలిపి, భవిష్యత్తును భగ్నం చేస్తే మానవవనరు పరంగా ఇక మిగిలేదేమీ ఉండదు! విరుగుడు లేని శాపమౌతుంది. ఇది ఒక తరం మనుగడకు సంబంధించిన మౌలికాంశం. కరొనా మహమ్మారికి దారుణంగా ప్రభావితమైన మానవ దశల్లో బాల్యమొకటి. గత 18 మాసాలుగా బాలలు నలిగినంతగా మరే వర్గం నలతకు గురికాలేదు. ఇది విశ్వవ్యాప్తం. దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఉన్న సమస్యే! బడులు మూతపడి, చదువుకు దూరమై, మానసికంగా కృంగి, శారీరకంగా నిస్సత్తువ ఆవహించి పిల్లల సమగ్రాభివృద్ది కుంటుపడింది. ఏడాదిన్నర మించిన ఈ వైకల్యం ఇంకా కొనసాగితే... బాలల భవిష్యత్‌ విద్యార్జన ప్రక్రియ ప్రతికూలంగా ప్రభావితమయ్యే ప్రమాద హెచ్చరికలున్నాయ్‌!

పేదరికం తాండవిస్తున్న చాలా చోట్ల బడుల మూతతో బాల్యం పనిప్రదేశాల బాట పట్టింది. బాలకార్మిక వ్యవస్థ మళ్లీ బలపడుతోంది. కొన్ని సామాజిక వర్గాలు, ఆర్థిక సమాజాల్లో పిల్లలు, ముఖ్యంగా బాలికలు తిరిగి బడులకు రాలేనంతగా బాల్యంపై కోవిడ్‌ దెబ్బకొట్టింది. పరోక్ష పద్ధతిన నిర్వహించిన ఆన్లైన్‌ తరగతుల ప్రక్రియ సరైన ప్రత్యామ్నాయం కాలేకపోయింది. భారత్‌ వంటి దేశాల్లో ఉన్నవారు–లేనివారి మధ్య అంతరాన్ని ఇది గగనసీమల దాకా ఎత్తి చూపింది. మహమ్మారి సృష్టించిన విలయ పదఘట్టనల్లో నలుగుతున్న మనకు, ఆ సడి వినిపించనేలేదు. స్మార్ట్‌ ఫోన్లు లేక, నెట్‌ సదుపాయం అందక, నిరంతర విద్యుత్‌ దొరక్క, ఎక్కువ మంది పిల్లలున్న ఇళ్లల్లో సదుపాయాలు చాలక, ‘యాప్‌’లు, సాంకేతిక వినియోగంపై నైపుణ్యం–అవగాహన కొరబడ్డ వారంతా బాధితులే! ఆన్లైన్‌ విద్యాబోధన వల్ల 60 శాతం మంది విద్యార్థులకు కనీస న్యాయం జరుగలేదన్నది తేలిన సత్యం! ఇలా తలెత్తిన ‘సాంకేతికత విభజన’ (డిజిటల్‌ డివిజన్‌) పేద, బడుగు–బలహీన, అల్పాదాయ, గ్రామీణ వర్గాల పిల్లల్ని తీవ్రంగా నష్టపరచినట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంతో పాటు దాదాపు అన్ని అధ్యయనాలు ఆధారాలతో నిరూపించాయి.

ఏదైతేనేం, మొత్తమ్మీద బాల్యం, వారి విద్యార్జన ప్రక్రియపై బలమైన దెబ్బ పడింది. సత్వరం దాన్నుంచి కోలుకోకుంటే అపార నష్టం తప్పదని నిపుణులు, మేధావులు చెవినిల్లు కట్టుకొని చెబుతున్నారు. వెంటనే బడులు తెరచుకోవాలని వస్తున్న సూచనలు, సలహాలు, ఒత్తిళ్లకు ప్రభావితమైన ప్రభుత్వాలు క్రమంగా బడిని తెరుస్తున్నాయి. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా గుజరాత్, పంజాబ్, ఛత్తిస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల్లో బడులు ఇప్పటికే తెరచుకున్నాయి. కర్ణాటకలోనూ పాక్షికంగా తెరిచారు. సెప్టెంబరు ఒకటి నుంచి చాలా రాష్ట్రాల్లో తెరచుకుంటున్నాయి. ఏడాదిన్నర కష్టకాలంలో ఇదొక ఆశావహ నిర్ణయం. ఆహ్వానించదగ్గ పరిణామం!

ఇల్లలుకగానే పండుగయినట్టు కాదు. ఇది పలు సమస్యలు, సవాళ్లతో ముడివడిన అంశం! ఒకవైపు బడులు తెరచుకుంటున్నా... కోవిడ్‌–19 రెండో అల చప్పబడుతూ, మూడో అల ముంచుకువస్తున్న సంధి కాలమిది! బడులు తెరవడం తప్పా, ఒప్పా అన్న మీమాంస, చర్చ కొనసాగుతూనే ఉంది. అనుకోని ఉపద్రవం వస్తే, బడులే వ్యాధి వ్యాప్తికి కేంద్రాలైతే, విద్యార్థులే వైరస్‌ వాహకులైతే... ఏమిటి పరిస్థితి? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవైపు చదువుల కోసం బడులు తెరుస్తూనే మరోవైపు కోవిడ్‌ వైరస్‌–వ్యాధి వ్యాప్తికి ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. పిల్లల బతుకు–బతుకుతెరువూ, రెంటినీ సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళ్లాలి. అవసరమైతే కొంత బడుల్లో, మరికొంత ఆన్లైన్‌ పద్దతిలో ‘సంకర (హైబ్రిడ్‌) విధానం’ పాటించైనా చదువులు సాగేలా చూడాలి.

శాస్త్రీయ ఆధారం లేకపోయినా, కోవిడ్‌–19 మూడో అల పిల్లలపై తీవ్రప్రభావం చూపుతుందనే ప్రచారం ఉంది. వారికిప్పుడిప్పుడే టీకా లభించే అవకాశం లేదు. దేశ వ్యాప్తంగా టీకా ప్రక్రియ మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది. బ్రిటన్, అమెరికాల్లో కూడా రెండు డోసుల టీకా ఇచ్చిన, ఇవ్వని ప్రాంతాల పిల్లల్లో... కరోనా వ్యాధి–ఇన్‌ఫెక్షన్‌ అదే నిష్పత్తి హెచ్చుతగ్గులతో ఉన్నట్టు వెల్లడైంది. మన దేశంలోనూ ఈ వ్యత్యాసాలున్నాయి. వీటి దృష్ట్యా, ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని బడుల నిర్వహణ ఉండాలి. ఈ వాతావరణంలో బడులు తెరుస్తున్నందున, కోవిడ్‌ ముందు జాగ్రత్తలపై పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లల తలిదండ్రులు, ప్రయివేటు విద్యా సంస్థల నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగానికి సమగ్ర అవగాహన పెంపొందించాలి. 

ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో జాగ్రత్త వహించకుంటే విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయే ప్రమాదముంది. విద్యా ప్రమాణాలు కాపాడుతూనే మరోవైపు కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, వ్యాధి విస్తృతిని అరికట్టాలి. ‘కోవిడ్‌ సముచిత ప్రవర్తన’ (సీఏబి) చాలా ముఖ్యం! నాణ్యమైన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం విధిగా అనుసరించాలి. బడుల భౌతిక స్వరూపం, నిర్వహణలో వీలయిన మేర మార్పు తీసుకురావాలి. తరగతి గదికి పరిమిత సంఖ్యలో విద్యార్థుల్ని అనుమతించాలి. గదుల్లోకి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేట్టు చూసుకోవాలి. వీలయితే ఆరుబయట చెట్ల నీడల్లో బహిరంగ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కేసులు తలెత్తిన చోట ఆయా బడుల్ని మూసి, తగు నివారణ చర్యలు చేపట్టాలి. మొత్తమ్మీద చదువుల ప్రక్రియను పునరుద్ధరించాలి. రేపటి పౌరుల నేటి బాల్యాన్ని కాపాడాలి.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top