
వెలుగుకు కమ్మిన చీకట్లు
సీసీ మృతితో భార్యకు హామీ ఇచ్చి..
డీఆర్‌డీఏ అధికారుల తీరు ఆ శాఖలో ఓ చిరుద్యోగి నిండు ప్రాణాలను బలితీసుకుంది. గత మే నెల రెండో తేదీన అమరావతిలో జరిగిన పునర్నిర్మాణ సభకు అధికారులు చేపట్టిన డ్వాక్రా మహిళల తరలింపులో భాగంగా బస్సులో డ్యూటీకి పంపబడిన డీఆర్‌డీఏ వెలుగు విభాగం మలికిపురం మండల క్లస్టర్ కో–ఆర్డినేటర్ డీటీ నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లాకు చెందిన నాగరాజు కొంత కాలంగా మలికిపురం వెలుగు కార్యాలయంలో పరిమిత జీతంతో కాంట్రాక్టు పద్ధతిలో క్లస్టర్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పటికే రెండు రోజుల నుంచీ అనారోగ్యంతో ఉన్న నాగరాజును అమరావతి సభకు బస్సులో డ్యూటీ వేశారు. అనారోగ్యం కారణంగా సెలవు ఇవ్వాలని అడిగినా అధికారులు ఆలకించలేదు. సభకు రాకపోతే జీతాలు ఇవ్వలేమని చెప్పినట్టు సమాచారం. సభ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఉంగుటూరు మండలం కై కరం వద్ద బస్సు దిగి, రోడ్డు దాటుతున్న నాగరాజును కోళ్ల వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.
షాక్‌లోనే నాగరాజు భార్య
భర్త మృతి చెందిన సంఘటనతో నాగరాజు భార్య ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. అప్పట్లో నాగరాజు భార్యకు సీసీ పోస్టు ఇస్తామని కొందరు నమ్మించారు. తీరా ఆమెకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందలేదు. జిల్లాలో మహిళల నుంచి చందాలు వసూలు చేసి, ఆర్థిక సాయమిచ్చి చేతులు దులుపుకొన్నారు. నాగరాజుకు ఇంటర్ పాసైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగరాజు జీతం మినహా కుటుంబానికి ఆధారం లేదు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారనేది గ్యారంటీ లేదు.
ఫ సిబ్బంది కొరతతో సతమతం
ఫ 66 సీసీ, 19 ఏపీఎం పోస్టుల ఖాళీ
ఫ ఎంసీపీ, హెచ్‌సీఎల్ యాప్‌లతో
మరింత భారం
ఫ రూ.కోట్లలో టర్నోవర్,
కాంట్రాక్టు సిబ్బందితోనే కాలక్షేపం
మలికిపురం: జిల్లా డీఆర్‌డీఏ పరిధిలోని వెలుగు విభాగంలో సిబ్బంది లేక చీకట్లు అలముకున్నాయి. జిల్లా వెలుగు కార్యాలయాల్లో కొంత కాలంగా 66 సీసీ (క్లస్టర్ కోఆర్డినేటర్), 19 మండలాలకు ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్)ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఎంసీపీ, హెచ్‌సీఎల్ యాప్‌లను ప్రవేశపెట్టి సిబ్బందిపై మరింత భారం పెంచింది. ఈ నేపథ్యంలో వెలుగు అధికారులు గ్రామస్థాయిలో వీవోఏలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వారి నుంచి సహాయకులుగా దరఖాస్తులను స్వీకరించారు. రాజకీయ పైరవీలు, పోటీ నుంచి తప్పించడానికి ఈ పోస్టులకు జీతాలు ఇవ్వలేని తాత్కాలిక వలంటీర్లుగా అధికారులు నామకరణం చేశారనే ప్రచారం నడుస్తోంది. ఆనక సీసీలుగా రెగ్యులర్ చేస్తామని లోపాయికారిగా మండల స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు అంటున్నారు. సాధారణంగా సీసీ పోస్టులకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ జీతాలుంటాయి. వెలుగులో చాలా కాలంగా ఇవి కాంట్రాక్టు పద్ధతిలోనే ఉన్నాయి. గ్రామ స్థాయిలో సీనియర్లను కాదని ఇష్టానుసారం నియామకాలను చేపట్టడంతో, సఖినేటిపల్లి మండల వీవోఏ సీనియర్లు, పొరుగు క్లస్టర్ వారిని తమ క్లస్టర్లలో నియమించారని మరికొందరు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే సదరు అధికారులను నిలదీయగా, ఈ విషయం వివాదాస్పదం కావడంతో.. వాటిని రద్దు చేస్తున్నామని సఖినేటిపల్లి మండల ఏపీఎం అజయ్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డీఆర్‌డీఏ పీడీని అడగడంతో, అవి సీసీ పోస్టులు కాదని, కేవలం సహాయకులేనని బదులిచ్చారు. ఈ నియామకాల్లో కింది స్థాయి అధికారుల మధ్య డబ్బు చేతులు మారుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అజమాయిషీ లేక..
వెలుగు విభాగంలో కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఈ విభాగానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారులు లేరు. డీఆర్‌డీఏ మాత్రమే పర్యవేక్షిస్తుంది. మండల స్థాయిలో ఏపీఎంలు ఉంటారు. వీరు కూడా కాంట్రాక్టు బేస్‌లోనే పని చేస్తారు. ఒక్కో మండలంలో రూ.20 కోట్ల పైబడి సీ్త్ర నిధి రుణాలుగా ఇస్తున్నారు. అలాగే రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల లావాదేవీలు జరుగుతాయి. ఇలాంటి కీలక ఆర్థిక వ్యవస్థకు మండల స్థాయిలో కాంట్రాక్టు సిబ్బంది ఉండడం గమనార్హం. రుణాలు ఇవ్వాలన్నా, గ్రూపుల వెరిఫికేషన్ చేయాలన్నా మండలానికి ముగ్గురు సీసీ (క్లస్టర్ కో–ఆర్డినేటర్లు) ఉంటారు. వీరు కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే పని చేస్తున్నారు. ఏపీఎం, సీసీలు పూర్తి స్థాయిలో ఉన్నారా అంటే అదీ లేదు. అందువల్లే వెలుగులో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో సీ్త్ర నిధి, మహిళల పేరుతో బినామీ రుణాలు, బ్యాంకులకు రీ పేమెంట్లు జరగకపోవడం వంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.
పోస్టుల ఖాళీలతో గందరగోళం
ఇప్పటికే తీవ్ర పనిభారంతో ఉన్న వీవోఏ నుంచి తాజాగా జిల్లాలో ఇన్‌చార్జి సీసీ అంటూ నూతన పోస్టులు ఎర వేశారు. గ్రామ స్థాయిలో వీవోఏల నుంచి దరకాస్తులు తీసుకోవడంతో, ఆయా గ్రామాల్లో వీవోఏల పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. జీతాల్లేని సీసీ సహాయకులుగా వెళ్తే, తమ వీవోఏ పోస్టులు ఉంటాయో, లేవో అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. దీంతో ఇన్‌చార్జి సీసీలుగా నియమితులైన వీవోఏల్లో గందరగోళం నెలకొంది. మండలానికి మూడుకు పైగా వీవోఏ పోస్టులు ఖాళీలు ఏర్పడనున్నాయని అంటున్నారు.
అక్కౌంటెంట్లదే హవా
జిల్లాలోని మండల స్థాయి వెలుగు కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న అక్కౌంటెంట్లదే హవా నడుస్తోంది. మహిళా సంఘాలు, సమాఖ్యలు ఏర్పడి 28 ఏళ్లయింది. అప్పట్నుంచి ఒకే అక్కౌంటెంట్ మండల కేంద్రాల్లో ఉన్నారు. వీరు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. సొంత ప్రాంతాలు కావడంతో మహిళా సమాఖ్యలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సమాఖ్య అక్కౌంట్ నుంచి వీరు జీతాలు పొందడం గమనార్హం. ఇన్నేళ్లుగా వీరికి బదిలీలు లేవు. వీరు ఇతర మండలాలకు వెళ్లకపోవడంతో, మండల సమాఖ్య నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే అభియోగాలూ ఉన్నాయి.
ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం
జిల్లా వెలుగు విభాగంలో సిబ్బంది కొరత ఉంది. దీనిపై సెర్ప్‌కు నివేదిక ఇచ్చాం. ప్రస్తుతం తాత్కాలికంగా సహాయకులను తీసుకుంటున్నాం. అవి సీసీ పోస్టులు కాదు. నియామకం పొందిన వారి నుంచి పక్కాగా లేఖలు తీసుకుంటాం. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. మండల స్థాయి సిబ్బంది అక్రమాలకు పా ల్పడి, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– జయచంద్ర గాంధీ, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్‌డీఏ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

వెలుగుకు కమ్మిన చీకట్లు

వెలుగుకు కమ్మిన చీకట్లు