
కుక్కలు, పందుల నివారణకు చర్యలు
అమలాపురం టౌన్: మున్సిపల్ రీజనల్ పరిఽధిలోని నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) సీహెచ్ నాగ నరసింహరావు స్పష్టం చేశారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే ఏర్పాట్లు చేశామని ఆర్డీ చెప్పారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలో కుక్కుల కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీలో రూ.15 లక్షలతో కుక్కల ఆపరేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ మున్సిపాలిటీలో పందులను నివారించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పట్టణాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పన్నుల వసూళ్లు నూరు శాతం జరిగేలా రెవెన్యూ విభాగాలు నిమగ్నం కావాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటి సరాఫరా విభాగాలపై ఆయన చర్చించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అమలాపురం కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు, మండపేట కమిషనర్ టీవీ రంగారావు, కొవ్వూరు కమిషనర్ నాగేంద్రకుమార్, నిడదవోలు కమిషనర్ కృష్ణవేణి, రామచంద్రపురం డీఈఈ శ్రీకాంత్, ముమ్మిడివరం కమిషనర్ వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.
కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవన నిర్మాణం పరిశీలన:
స్థానిక 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మితమవుతున్న కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవనాన్ని ఆర్డీ నాగ నరసింహరావు పరిశీలించారు. సమీక్షా సమావేశం అనంతరం పట్టణంలో ఆయన పర్యటించి పలు విభాగాలను సందర్శించారు. డ్రెయిన్లతో పూడిక తీయాల్సిన డీఈఈ నాగ సతీష్‌తో ఆర్డీ చర్చించారు.
మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు