
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆర్టీసీ బస్ నుంచి ఊడిన డీజిల్ ట్యాంక్
● డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్ నిలిపివేత
సీతానగరం: మండలంలోని వంగలపూడి ఏటిగట్టుపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ ఊడి పోవడంతో గమనించిన డ్రైవర్ బస్‌ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఫైర్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రమాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఉదయం 9 గంటలకు పురుషోత్తపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లుతున్న ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ వంగలపూడి – సింగవరం మధ్యలో ఊడి అందులోని డీజిల్ బయటకు లీకై ంది. డ్రైవర్‌కు బస్ నుంచి శబ్ధం రావడంతో ఏటిగట్టుపై బస్‌ని నిలిపివేశాడు. బస్‌ను గమనించగా డీజిల్ ట్యాంక్ ఒక వైపు ఊడి రోడ్డుపై రాసుకుంటూ వచ్చింది. బస్‌ను అలాగే నడిపి ఉంటే రోడ్డుపై ట్యాంక్ రాచుకుని నిప్పు రవ్వలు వచ్చి డీజిల్‌కు అంటుకుంటే ప్రయాణికుల పరిస్తితి ఏంటని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్‌ను అభినందించారు. ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్‌లో పంపించారు. పది కిలోమీటర్ల సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు శిథిలం అవ్వడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గత నెలలో కూటమి నాయకులు రోడ్డుకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టలేదు. రోడ్డు శిథిలమవ్వడంతో ఆర్టీసీ బస్‌లు తరచు పాడవుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.