
రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ద్రాక్షారామలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతి చెందాడు. ద్రాక్షారామ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం హసన్‌బాదకు చెందిన పిల్లి గోపాలకృష్ణ(27)కు గత నెల 22న వివాహం జరిగింది. గోపాలకృష్ణ కాజులూరు మండలం గొల్లపాలెంలో మోటారు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అత్తవారి ఊరు కె.గంగవరం మండలం శివల వెళుతూ ఉండగా యానాం వెళుతున్న ఆర్‌టీసీ బస్సుకు అతడి చొక్కొ తగులుకోవడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలతో ఉన్న అతడిని స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా ఆసుపత్రిలో మృతి చెందాడు. వృద్దాప్యంలో ఉన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులు పిల్లి సూర్యనారాయణ, భూలక్ష్మిలకు కుమారుడు, కుమార్తె ఉండగా గోపాలకృష్ణ పెద్దవాడు. కుమార్తెకు ఇదివరకే వివాహం జరుగగా కొంచెం అమాయకంగా ఉండే గోపాలకృష్ణకు గత నెల 22నే వివాహం జరిగింది. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరితరం కావడం లేదు. దీనిపై ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.