
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): మండంలోని దోమ్మేరు శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడి క్కడే మృతి చెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దోమ్మేరు గ్రామానికి చెందిన చిగురుపల్లి విద్యాసాగర్ (18) కాపవరం వెళ్లి అక్కడ నుంచి మోటార్ సైకిల్‌పై వస్తుండగా కొవ్వూరు వైపు నుంచి పంగిడికి గడ్డితో వెళుతున్న ట్రాలీ ట్రాక్టర్ ఎదురుగా ఢీకొనడంతో విద్యాసాగర్ దాని చక్రాల కింద పడిపోయాడు. దీంతో అతని తల, ఇతర శరీరభాగాలు నుజ్జయ్యి మృతి చెందాడు. విద్యాసాగర్ కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి అరవింద్ కుమార్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి, చెల్లి జోత్స్న ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో వారి రోదన వర్ణనాతీతమైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. సీఐ విజయబాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని వారికి నచ్చ చెప్పి యువకుడి మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రమాదానికి కారణమైన ట్రాలీ ట్రాక్టర్
న్యాయం చేయాలని
కుటుంబ సభ్యుల బైఠాయింపు
సీఐ జోక్యంతో పరిస్థితి ప్రశాంతం

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి