
సర్వాంతర్యామి.. సదా స్మరామి..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు
● ఒక్కరోజే దేవస్థానానికి
రూ.47.78 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చ కుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అర్చక స్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అభిషేకార్చన లు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకార ప్రియుడై న స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సా ధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసింది.
క్షేత్రపాలకుడికి పూజలు
ఆలయ ఆవరణలో క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామి వారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా ఒక్కరోజు దేవస్థానానికి రూ.47,78,296 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
షామియానాల ఏర్పాటు
శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షానికి వాడపల్లి క్షేత్రంలో అన్నప్రసాదం తాత్కాలిక షెడ్డు పడిపోయింది. దీంతో శనివారం తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం స్వీకరించడానికి ఇబ్బందులు లేకుండా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన షామియానాలు ఏర్పాటు చేయించారు.