సాక్షిపై కక్ష సాధింపు దారుణం | - | Sakshi
Sakshi News home page

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

May 9 2025 12:11 AM | Updated on May 9 2025 12:11 AM

సాక్ష

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

ఎడిటర్‌ ధనుంజయరెడ్డి

ఇంట్లో సోదాలు అప్రజాస్వామికం

పోలీసుల వైఖరిని తీవ్రంగా

ఖండించిన పాత్రికేయులు

పలుచోట్ల అధికారులకు వినతి పత్రాలు

ప్రజాస్వామ్యానికి పాతరేసి.. నిబంధనలకు

నీళ్లొదిలి.. నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష సాధింపునకు దిగడం దారుణమని పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం సోదాలకు తెగబడిన పోలీసుల తెంపరితనాన్ని జర్నలిస్టు సంఘాలు ఎండగట్టాయి. ప్రభుత్వ అవినీతిపై వరుసగా సాక్షిలో కథనాలు రావడంతోనే ప్రభుత్వం పత్రిక ఎడిటర్‌ ఇంటిపై దాడికి దిగిందని, ఇది అమానుషమని పేర్కొంటూ ఈ దుశ్చర్యను కలం వీరులు తీవ్రంగా ఖండించారు.

అమలాపురం రూరల్‌: సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చాలా దారుణం, అప్రజాస్వామికంమని పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో కక్ష సాధింపుగా ఎడిటర్‌ ఇంట్లోకి పోలీసులు వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించడం చాలా దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా అమలాపురంలో గురువారం విలేకరులు నిరసన తెలిపారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌, ప్రింట్‌ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్యనారాయణ, ప్రెస్‌క్లబ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు ఎండీ బషీర్‌, సాక్షి స్టాప్‌ రిపోర్టర్‌ నిమ్మకాయల సతీష్‌బాబు, ఏపీడబ్ల్యూజే అమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు అరిగెల రుద్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పద్ధతులు మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిజాలను వెలికితీస్తున్నందుకే పత్రికల గొంతునొక్కేందుకు అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందన్నారు. ఇలాంటివి మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ గెద్దాడ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పరస సుబ్బారావు, కట్టా మురళీకృష్ణ, నల్లా విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్‌ డే పాటించిన పాత్రికేయులు

కొత్తపేట: సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణమని కొత్తపేట నియోజకవర్గ విలేకరులు ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి, బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తరఫున పోలీసు చర్యలకు నిరసనగా గురువారం డివిజన్‌ కేంద్రం కొత్తపేటలో విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి, బ్లాక్‌ డే పాటించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. వరుస భూముల కుంభకోణాలను సాక్షి వెలుగులోకి తీసుకుని వస్తుండటంతో పాటు అమరావతి టెండర్లలో అక్రమాలపై వార్తా కథనాలను ప్రసారం చేస్తుండటంతో ప్రభుత్వం సాక్షి గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అందులో భాగంగా ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు సోదాల పేరుతో అక్రమంగా ప్రవేశించి విచారణ పేరుతో వేధింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో కక్ష సాధింపుగా సాక్షి పత్రికను టార్గెట్‌ చేయడం, ఎడిటర్‌ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తగవన్నారు. ఇలాంటివి మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ఆర్‌డీఓ పీ శ్రీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ విలేకరులు జగతా రాంబాబు, నామాల ఏసురాజు, కొవ్వూరి ఆదినారాయణరెడ్డి, వులుసు వీవీఎస్‌ సుబ్బారావు, శ్రీఘాకోళ్లపు బాబి పాల్గొన్నారు.

ఇది అప్రజాస్వామికం

కపిలేశ్వరపురం: సాక్షి దినపత్రికపై అక్కసు కక్కుతూ పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం అప్రజాస్వామికమని కపిలేశ్వరపురం మండలానికి చెందిన సీనియర్‌ రిపోర్టర్లు ఖండించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా పోలీసులు ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లోకి వెళ్లడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి కోశెట్టి దేవసహాయం, సీనియర్‌ రిపోర్టర్లు పెద్దింశెట్టి లెనిన్‌బాబు, శేఖర్‌, చిట్టికుమార్‌ అన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తూ వారు కపిలేశ్వరపురంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన పత్రిక ఎడిటర్‌ పట్ల పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు.

అమానుషం

రామచంద్రపురం: ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ నిజాలను వెలికి తీస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం అమానుషం అని ఏపీజేడబ్ల్యూ జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు కాటే భీమశంకరం, ఏపీజేడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి బోడపాటి ప్రసాద్‌ అన్నారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేయటాన్ని నియోజకవర్గ ప్రెస్‌ క్లబ్‌, జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డీ అఖిలకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. పత్రికా పరంగా ఏదైనా తప్పు జరిగితే న్యాయపరంగా ఎదుర్కోవాలని, అంతేకాని ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఇలా జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేయటం తగదని వారు అన్నారు. నియోజకవర్గ ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి నరాల రాధాకృష్ణ, జర్నలిస్టులు బాషా, కొప్పిశెట్టి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

రాయవరంలో నిరసన

రాయవరం: ‘సాక్షి’ సంపాదకుడు ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేయడంపై మండలంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. పి.సుబ్బరాజు, సత్యనారాయణరెడ్డి, చందు, వంశీ పాల్గొన్నారు.

పోలీసుల దాడి అనైతికం

అమలాపురం టౌన్‌: ఎలాంటి నోటీసు లేకుండా విజయవాడలోని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేసిన ఏపీ పోలీసుల తీరు అనైతిక చర్యని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్వీ ప్రసాద్‌ స్పష్టం చేశారు. ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు వ్యవహరించిన తీరు ఎంత మాత్రం సహేతుకంగా లేదని పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఉన్నత న్యాయ స్థానాల దృష్టికి తీసుకుని వెళ్లాలని జర్నలిస్టులు, ప్రెస్‌ క్లబ్‌లు నిర్ణయించాయన్నారు. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళుతున్న కారణంగా జర్నలిస్ట్‌లను భయపెట్టి అదుపులో పెట్టుకోవాలన్న ఏకై క లక్ష్యంతో ఏపీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ తనిఖీల్లో ఏమీ లభించలేదు. కేవలం రాజకీయ కక్ష పూరిత కుట్రలో భాగంగా ధనుంజయరెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో ఈ తనిఖీలు చేసి, వేధింపులకు పాల్పడుతున్నారని ప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లేనని తెలిపారు.

సాక్షిపై కక్ష సాధింపు దారుణం1
1/4

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

సాక్షిపై కక్ష సాధింపు దారుణం2
2/4

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

సాక్షిపై కక్ష సాధింపు దారుణం3
3/4

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

సాక్షిపై కక్ష సాధింపు దారుణం4
4/4

సాక్షిపై కక్ష సాధింపు దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement