
కల్యాణ వేదిక ముస్తాబు
గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి రామాలయం పక్కన గల కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వెనుక వైపు నుంచి కూడా కల్యాణం తిలకించేలా స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. సుగంధ భరిత పుష్పాలతో ఆలయ ప్రాంగణం, అనివేటి మండపం, స్వామివారి కల్యాణ వేదిక, వేదిక ముందు గల విశ్రాంతి మండపాన్ని అలంకరిస్తున్నారు.
విద్యుత్ దీపాలంకరణతో
శోభిల్లుతున్న రత్నగిరి (ఫైల్)
● నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
● వారం రోజుల పాటు వేడుక
● ఘనంగా ఏర్పాట్లు
అన్నవరం: శ్రీ సత్యదేవుని పెళ్లి ఉత్సవాలు వైశాఖ శుద్ధ దశమి, బుధవారం శ్రీకారం చుట్టుకుంటున్న శుభవేళ రత్నగిరి కల్యాణ శోభతో కళకళ లాడుతోంది. కల్యాణ మహోత్సవాలు బుధవారం ప్రారంభమవుతున్నాయి. గురువారం రాత్రి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్యకల్యాణం జరగనుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో రోజుకొక వేడుకతో భక్తులకు కనువిందు కలుగనుంది. ఈ నెల 13వ మంగళవారం రాత్రి జరిగే శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కుమార్తెలను చేస్తారు. రత్నగిరిపై అనివేటి మండపంలో పండితుల మంత్రోచ్ఛాటన మధ్య జరిగే ఈ కార్యక్రమంలో ముత్తయిదువులు పసుపు దంచుతారు. రాత్రి ఏడు గంటలకు రాజా రామరాయ కళావేదిక మీద స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.
రూ.కోటి వ్యయంతో ఏర్పాట్లు
శ్రీసత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణకు రూ.25 లక్షలు, మిగిలిన మొత్తాన్ని రంగులు, పుష్పాలంకరణ, స్వామి, అమ్మవారి అలంకరణకు , భద్రతాచర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, వైదిక కార్యక్రమాలకు కేటాయించారు.
ఏర్పాట్లు పరిశీలించిన
పెద్దాపురం డీఎస్‌పీ శ్రీహరి రాజు
సత్యదేవుని కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను పెద్దాపురం డీఎస్‌పీ శ్రీహరి రాజు మంగళవారం పరిశీలించారు. ప్రధానంగా కల్యాణం జరిగే వేదిక, దాని ముందు కల్యాణం తిలకించేందుకు విచ్చేసే వీఐపీలు, భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లు డీఎస్‌పీ అడిగి తెలుసుకున్నారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు. ఆయన వెంట ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తదితరులున్నారు.
కల్యాణ ఉత్సవాల షెడ్యూల్
బుధవారం
సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని వధూవరులను చేసే కార్యక్రమం. రాత్రి తొమ్మిది గంటలకు కొండదిగువన ఆంజనేయ వాహనంపై సీతారాముల ఊరేగింపు
గురువారం
ఉదయం తొమ్మిది గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, రుత్విక్కుల దీక్షా వస్త్రధారణ,
రాత్రి ఏడు గంటలకు కొండదిగువన స్వామివారు వెండి గరుడ వాహనం మీద, అమ్మవారు వెండి గజ వాహనం మీద, సీతారాములు వెండి పల్లకీ మీద ఊరేగింపు రాత్రి తొమ్మిది గంటల నుంచి కల్యాణం
శుక్రవారం
రాత్రి ఏడు గంటలకు : అరుంధతి నక్షత్ర దర్శనం, తొమ్మిది గంటలకు కొండ దిగువన రావణబ్రహ్మ వాహనం మీద స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శనివారం
మధ్యాహ్నం 2–30 గంటలకు: అనివేటి మండపంలో వేద పండిత సదస్యం. రాత్రి తొమ్మిది గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని పొన్న వాహనంపై ఊరేగింపు
ఆదివారం
సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మ వార్ల వన విహారోత్సవం, ఐదు గంటలకు నూత నరథంపై సత్యదేవుడు, అమ్మవార్ల గ్రామోత్సవం
సోమవారం
ఉదయం 9–00 గంటలకు పంపా సరోవరంలో స్వామి, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, సాయంత్రం నాలుగు గంటలకు నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజాఅవరోహణ, కంకణ విమోచన
మంగళవారం
రాత్రి 7–30 గంటలకు నిత్యకల్యాణ మండపంలో శ్రీపుష్పయాగం

కల్యాణ వేదిక ముస్తాబు

కల్యాణ వేదిక ముస్తాబు