
ఏటిగట్లకు రక్షణ పనులు
● వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం
● ఎస్‌ఈ గోపీనాఽథ్
ధవళేశ్వరం: బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించామని, తాత్కాలికంగా అక్కడ పటిష్ట పనులు చేపడతామని వరదల అనంతరం శాశ్వత నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ కె.గోపీనాఽథ్ పేర్కొన్నారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఇరిగేషన్ అధికారులు, సిబ్బందితో ఆయన వరదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కూళ్ళ, సుందరపల్లి, కుండలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఏట్టిగట్లు బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని, అక్కడ తాత్కాలిక రక్షణ చర్యలు చేపడతామన్నారు. కాజా ఈస్ట్ కొక్కిలేరు, కడలి తదితర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఔట్‌ఫాల్ స్లూయిజ్ స్థానంలో కొత్తవి నిర్మించడానికి 9.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా పటిష్టం చేసి వరదల అనంతరం నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. వరదల్లో 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినా తట్టుకునే విధంగా ఏటిగట్లు ఉన్నాయని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని వరదలను ఎదుర్కోవాలని సూచించారు. డిప్యూటీ ఎస్‌ఈ జీ కనకేష్, హెడ్‌వర్క్స్ ఈఈ కాశీ విశేశ్వరరావు, తూర్పు డెల్టా ఈఈ వి.రామకృష్ణ, మధ్య డెల్టా ఈఈ బి శ్రీనివాస్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
కొవ్వూరు: పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న మద్దుల వెంకట రామకృష్ణ ఈ నెల ఐదో తేదీ నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఆర్.సాంబమూర్తి మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈయనకు ముగ్గురు సంతానం ఉన్నారని, చేసిన అప్పులు తీర్చడం భారంగా మారడంతో సోమవారం ఇంటి నుంచి బయటి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని రామకృష్ణ తండ్రి శ్రీహరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.