ఇక మహా రుడా.. మరింత విస్తరించిన రాజమండ్రి | Rajamundry urban development authority extended further more | Sakshi
Sakshi News home page

రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ పరిధి మరింత పెంపు

Mar 30 2023 2:22 AM | Updated on Mar 31 2023 11:39 AM

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామీణ ప్రాంతాల వికాసానికి మరో కీలక అడుగు పడింది. అభివృద్ధికి మార్గం సుగమమైంది. నగరం, పల్లెలను అనుసంధానిస్తూ రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా) ఇప్పటికే జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటి పరిధి మరింతగా విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పరిధిలోని నాలుగు మండలాలకు విస్తరిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. 3,142.002 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మహా రుడాగా ఆవిర్భవించింది. రుడా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటికి నాలుగుసార్లు విస్తీర్ణం పెంచారు.

విస్తరణ ఇలా...

రుడా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 17 మండలాలు, 207 గ్రామాల పరిధిలో 1,566.442 చదరపు కిలోమీటర్ల మేర ఉండేది. విస్తరణలో భాగంగా గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలతో పాటు, రాజానగరం నియోజకవర్గం పరిధి కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 102 గ్రామాలు కలిశాయి. వీటి విస్తీర్ణం 1,131.60 చ.కి.మీ. వీటితోపాటు అదనంగా ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలంలోని ఆరు గ్రామాల విలీనంతో 17.09 చ.కి.మీ. అదనంగా కలిశాయి. ఫలితంగా మొత్తం 1,148.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరణ పెరిగింది. దీంతో రుడా పరిధి 2,715.132 చదరపు కిలో మీటర్లకు చేరింది. తాజాగా ఈ నెల 21వ తేదీన రావులపాలెం, ఆలమూరు మండలాల పరిధిలో 26 గ్రామాలను విలీనం చేశారు. తద్వారా 150.14 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం పెరిగింది. దీంతో విస్తీర్ణం 2,804.022 చదరపు కిలోమీటర్లకు చేరింది.

విలీనమైన గ్రామాలివే...

రామచంద్రపురం రూరల్‌: చోడవరం, అంబికపల్లి, అగ్రహారం, నరసాపురపుపేట, ఓడూరు, తాడేపల్లి, యనమదల, కాపవరం, కందులపాలెం, వెల్ల, యేరుపల్లి, ఉట్రుమిల్లి, వెలంపాలెం, జగన్నాయకులపాలెం, ద్రాక్షారామ, వెంకటాయపాలెం, వేగాయమ్మపేట, తోటపేట, హసన్‌బాద, ఉండూరు, భీమక్రోసుపాలెం.

కపిలేశ్వరపురం: నేలటూరు, వల్లూరు, నిడసనమెట్ట, వడ్లమూరు, నల్లూరు, వెదురుమూడి, అంగర, పడమర ఖండ్రిగ, టేకి, వాకతిప్ప, మాచర, కోరుమిల్లి, కపిలేశ్వరపురం, తాతపూడి.

రాయవరం: లొల్ల, వెదురుపాక, నదురుబాద, సోమే శ్వరం, వెంటూరు, కూర్మాపురం, కురకాళ్లపాలెం.

కె.గంగవరం: అద్దంపల్లి, అముజూరు, బాలాంత్రం, భట్లపాలిక, దంగేరు, గంగవ రం, గుడిగళ్లబాగ,గుడిగళ్లరాళ్లగుంట, కూళ్ల, కోట, కోటిపల్లి, కందూరు, మసకపల్లి, పామర్రు,పాణింగిపల్లి, పేకేరు, సత్యవాడ, శివల, సుందరపల్లి, తామరపల్లి, వి.గంగవరం, యండగండి, యర్రపోతవరం.

తాజాగా మరోసారి..

తాజాగా ఈ నెల 21వ తేదీన పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మరో నాలుగు మండలాల పరిధిలోని (రామచంద్రపురం రూరల్‌, కె.గంగవరం, రాయవరం, కపిలేశ్వరపురం) 65 గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన ఉత్తర్వులు వెలువరించింది. దీంతో రుడా మహా రుడాగా ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 2,804.022 చదరపు కిలో మీటర్ల మేర ఉన్న విస్తీర్ణం..పెరిగిన 338 చదరపు కిలో మీటర్లతో 3,142.002కు చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో రుడా 400 గ్రామాల్లో విస్తరించి మహా రుడాగా అవతరించింది.

ఎమ్మెల్యే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర

రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లోని గ్రామాలను రుడాలో కలపాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీరి అభ్యర్థనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రణాళికా విభాగం ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సైతం పూర్తయింది. ఇటీవల నిర్వహించిన రుడా బోర్డు సమావేశంలో విలీనంపై తీర్మానం సైతం చేశారు. తాజాగా ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది.

అభివృద్ధి మరింత విస్తృతం

రుడా విస్తరణతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అర్బన్‌ వెల్ఫేర్‌పై దృష్టి సారించింది. రుడా ఏర్పడిన ఏడాదిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. భవిష్యత్తులో మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఎమ్మెల్యేలు అభ్యర్థించిన వెంటనే గ్రామాల విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడాన్ని బట్టి చూస్తే జగనన్నకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ అర్థమవుతుంది. ఎమ్మెల్యేల సమన్వయంతో విలీన ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేస్తాం.

– మేడపాటి షర్మిలారెడ్డి, రుడా చైర్మన్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement