వయసులో చిన్న.. వ్యాపారంలో మిన్న..!

Zerodha brothers topped the list of young treasures - Sakshi

యువ ఐశ్వర్యవంతుల్లో జీరోధా సోదరులకు అగ్ర స్థానం 

బెజవాడకు చెందిన శ్రీహర్ష మాజేటికి చోటు 

హరూన్‌ ఇండియా యువ సంపన్నుల జాబితా విడుదల 

కరోనాలోనూ సంపదకు రెక్కలు 

16 మంది ఉమ్మడి సంపద రూ.44,900 కోట్లు

న్యూఢిల్లీ: చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదాసీదా ఉద్యోగంతో తృప్తిచెందక.. సొంతంగా స్టార్టప్‌ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతృప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్, హరూన్‌ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జీరోధా’ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్, నిఖిల్‌ కామత్‌ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్‌2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్‌ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్‌ రెడ్డితో కలసి 2013లో బండిల్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్‌ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు టెన్సెంట్‌ హోల్డింగ్స్, నాస్పర్స్‌ లిమిటెడ్, డీఎస్‌ టీ గ్లోబల్‌ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్‌ విలువ 3 బిలియన్‌ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. 

ఇంటర్నెట్‌ వేదికగా విస్తరణ 
40  ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ అండ్‌ హరూన్‌ ఇండియా సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2020 ఆఫ్‌ ఎంటర్‌ ప్రెన్యుర్స్‌ అండర్‌ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్‌ వర్త్‌ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్‌ వేదికగా స్టార్టప్‌ పెట్టి జాక్‌ పాట్‌ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో తొలి 2 స్థానాల్లో ఉన్న జీరోధా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58% పెంచుకున్నారు. జాబితాలో 9వ స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్‌ అగర్వాల్‌ సంపద ఈ ఏడాది   40% పడింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం దీనికి కారణం. వీయూ టెక్నాలజీస్‌ (వూ బ్రాండ్‌) దేవిత సరాఫ్‌ సంపద కూడా 33% తగ్గింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత. ‘‘కొందరు స్టార్టప్‌ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా వైదొలగి ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు దన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల వృద్ధిపై ఎంతో ప్రభావం చూపింది’’అని హరూన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహమాన్‌ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top