ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!

Sakshi Special Story On International Travel Insurance Full details

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు... రిస్క్‌లను తెలుసుకోవాలి

సమస్య ఏ రూపంలో అయినా రావచ్చు సమగ్ర కవరేజీ ఉన్న ప్లాన్‌ తీసుకోవాలి

నియమ, నిబంధనలను అధ్యయనం చేయాలి

అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్‌ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి.

ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్‌ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్‌ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్‌ కవరేజీ ఉన్న ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది.

ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్‌లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్‌ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు.

కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి.  

టీపీఏ, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు
బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి.  ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను ఆమోదించే నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్‌వర్క్‌ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు.

అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

ఊహించని అవరోధాలు..
ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్‌ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్‌ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్‌ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి.

కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్‌ ప్లాన్‌ థర్డ్‌ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్‌ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్‌ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top