బ్లెస్సింగ్స్‌ అడిగిన కస్టమర్‌కు ఆనంద్‌ మహీంద్ర అదిరిపోయే రిప్లై

Man Buys SUV After 10 Years Of Hard Work Anand Mahindra Replies - Sakshi

సాక్షి, ముంబై: మహీంద్ర గ్రూప్ చైర్‌పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర తమ కస్టమర్‌ ట్విట్‌కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. తనకంటూ ఒక కారును సొంతం చేసుకోవడం సగటు మానవుడి కల. ఆ కల సాకారమైన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఏకంగా తన కారు కంపెనీ ఓనరుతోనే ఈ ఆనందాన్ని షేర్‌ చేసుకోవడం విశేషంగా నిలిచింది. కష్టపడి కారుకొనుక్కున్నాను. ఆశీర్వదించండి అన్న వినియోగదారుడికి అభినందనలు తెలుపుతూ ఆనంద్‌ మహీంద్ర  స్పందించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి  వెడితే..  అశోక్‌ కుమార్‌ అనే ట్విటర్‌  యూజర్‌ తాజాగా మహీంద్రా XUV700ని  కొనుగోలు చేశారు. ఈ ఆనందాన్ని మహీంద్ర చీఫ్‌తో పంచుకోవాలనుకున్నారు. మహీంద్ర  ఎస్‌యూవీతో ఫోటోను పోస్ట్‌ చేస్తూ.."10 సంవత్సరాలు  కష్టపడి కొత్త మహీంద్రా XUV 700ని కొనుగోలు చేశా.. సార్ మీ ఆశీర్వాదం కావాలి."అంటూ  ఆ పోస్ట్‌ను ఆనంద్‌ మహీంద్రకు ట్యాగ్ చేశారు.

దీనికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ "ధన్యవాదాలు, కానీ వాస్తవానికి మా కంపెనీ కారుఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో  స్పందనగా అశోక్‌కుమార్‌  ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు.  ‘మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఒ​క యూజర్‌  కామెంట్‌ చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top