కట్టు తప్పనున్న కరెంట్‌ అకౌంట్‌ లోటు!

India Ratings Report On Current Account Deficit - Sakshi

2021–22లో 43.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యే అవకాశం

ఇదే జరిగితే ఈ పరిమాణం మూడేళ్ల గరిష్ట స్థాయి

ఇండియా రేటింగ్స్‌ నివేదిక    

ముంబై: భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌–సీఏడీ) మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో మూడేళ్ల గరిష్ట స్థాయి 43.8 బిలియన్‌ డాలర్లకు ఎగసే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 1.8 శాతం ఉంటుందని రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. 2020–21లో కరెంట్‌ అకౌంట్‌ 23.91 బిలియన్‌ డాలర్ల మిగుల్లో ఉంది. జీడీపీలో ఇది 0.9 శాతం.  దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్‌.  రేటింగ్స్‌ సంస్థ తాజా నివేదికలోని అంశాలను పరిశీలిస్తే.. 
– 2021–22 చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) క్యాడ్‌ 17.3 బిలియన్‌ డాలర్లు (త్రైమాసిక జీడీపీలో 1.96 శాతం) నమోదయ్యే అవకాశం ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో క్యాడ్‌ 8.2 బిలియన్‌ డాలర్లుగా (1.03 శాతం) ఉంది. 
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ముఖ్యంగా కమోడిటీ ధరల పెరుగుదల సమస్య తీవ్రమైంది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి, అస్థిరత వల్ల భారత్‌ ఎగుమతులు గణనీయమైన ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలను కుదించింది. ఇంతక్రితం ఈ రేటు 4.7 శాతం అంచనాలను తాజాగా 3 శాతానికి కుదించింది.  
- ప్రపంచ వాణిజ్య సంస్థ భారతదేశం కీలక ఎగుమతి భాగస్వాములైన ఉత్తర అమెరికా, యూరప్‌ల దిగుమతుల వృద్ధిని 2022లో వరుసగా 3.9 శాతం మరియు 3.7 శాతంగా అంచనా వేసింది,  తొలి అంచనాలు 4.5 శాతం, 6.8 శాతం కావడం గమనార్హం.  
- అధిక చమురు ధరలు సౌదీ అరేబియా వంటి చమురు–ఎగుమతి దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది అధిక వాస్తవ ఆదాయాలకు దారి తీస్తుంది. చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో దిగుమతి డిమాండ్‌ తొలి అంచనా 8.7 శాతం నుంచి 11.7 శాతానికి పెరుగుతుందని తాజా అంచనా.  
- పెరిగిన కమోడిటీ ధరలు, రూపాయి క్షీణత నేపథ్యంలో భారత్‌ దిగుమతులు పెరగవచ్చు. 
- ఇక భారత్‌ ఎగుమతులు 2022–23 తొలి త్రైమాసికంలో 17.7 శాతం పెరిగి 112.5 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని భావిస్తున్నాం. ఇక దిగుమతులు 44.1 శాతం వృద్ధితో 120.9 బిలియన్‌ డాలర్లకు  చేరవచ్చు. 
- డాలర్‌ మారకంలో రూపాయి విలువ మొదటి త్రైమాసికంలో సగటున 77.1గా ఉంటుందని భావిస్తున్నాం. 2021–22 ఇదే త్రైమాసికంలో పోల్చితే ఇది 4.5 శాతం తక్కువ. 

చదవండి: ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top