లీనా నాయర్‌ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన

Anand Mahindra Congratulate Leena Nair Compare with Good Virus - Sakshi

Anand Mahindra Congratulate Leena Nair: ఓవైపు కరోనా వేరియెంట్ల విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు వరుసబెట్టి టాప్‌ కంపెనీల సీఈవోలు బాధ్యతల నుంచి వైదొలుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో వర్చువల్‌ స్పేస్‌కు భవిష్యత్తు ఉండడం, ట్యాక్స్‌ చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే వాళ్లంతా వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రఖ్యాత ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌజ్‌ షునల్‌కి గ్లోబల్‌ సీఈవోగా భారతీయురాలు లీనా నాయర్‌ బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

ఇదే విషయంపై వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ‘మొత్తానికి సిలికాన్‌ వ్యాలీలో మాత్రమే కాదు.. ప్యారిస్‌ గల్లీలో కూడా భారతీయ సీఈవో అనే మంచి వైరస్‌ను పట్టేశారు. శెభాష్‌ లీనా.. మమ్మల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయండి’ అంటూ లీనా నాయర్‌ను అభినందిస్తూనే ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.  

లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్‌(52) ప్రఖ్యాత ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌజ్‌ షునల్‌కి గ్లోబల్‌ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్‌ ప్రస్తుతం యూనిలీవర్‌ సంస్థలో చీఫ్‌ హుమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్‌ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి భారతీయురాలు మాత్రమే కాదు.. ఆసియన్‌ మహిళ కూడా లీనా నాయర్‌ కావడం భారత్‌కు గర్వకారణం.

ఇక ఇంతకు ముందు పరాగ్‌ ట్విటర్‌ సీఈవోగా ఎంపికైన సమయంలో ఐరీష్‌ బిలియనీర్‌, స్ట్రైప్‌ కో ఫౌండర్‌ ప్యాట్రిక్‌ కొలిసన్‌ చేసిన సెటైరిక్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్‌. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్‌ సీఈవో వైరస్‌. దీనికి వ్యాక్సిన్‌ కూడా లేదు’ అంటూ దీటుగా ఆనంద్‌ మహీంద్రా బదులిచ్చిన విషయం తెలిసిందే.

లీనా నాయర్‌ నేపథ్యం.. ఆసక్తికర విషయాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top