టార్గెట్.. వైఎస్సార్‌సీపీ
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ అరాచకాలు
పోటీ చేస్తారనుకునే వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పోలీసుల బెదిరింపులు
పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధింపులు
నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకునే కుట్రలు..
ఎన్‌ఓసీ కోసం మున్సిపాలిటీకి వెళితే.. పోలీసులకు ఫోన్ వెళుతోంది
పల్నాడు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అరాచక పర్వం
బాబు సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తూ ‘సెల్ఫీ చాలెంజ్’ వీడియో పెడితే బైండోవర్లు
ఒక్క గురజాలలోనే ఏకంగా 300మందికిపైగా బైండోవర్
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకూ వేధింపులు
బైండోవర్లను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు సర్కారు అధికారం అండతో అరాచకాలకు పదును పెట్టింది. సర్వత్రా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహంతో రెడ్‌బుక్ బరితెగింపు చర్యలకు తెగబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆశావహులను పోటీ నుంచి తప్పించేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని బైండోవర్ వేధింపులకు దిగింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే బైండోవర్ కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకు పోలీసులను పురిగొల్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఆశావహులకు బైండోవర్ పేరుతో పోలీసుల బెదిరింపులు మొదలయ్యాయి.
గుంటూరు, పల్నాడు..చిత్తూరు, అనంతపురం, కృష్ణా తదితర జిల్లాల్లో బైండోవర్ల పేరుతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను సైతం టార్గెట్ చేసి బైండోవర్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పాలక పక్షానికి ఎదురు నిలవకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయకుండా కక్షపూరితంగా పోలీసులను ప్రయోగించటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఎన్‌ఓసీ కోసం మున్సిపాలిటీకి వెళితే.. పోలీసులకు ఫోన్ కాల్
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారిని సైతం పోలీసులు వదలడంలేదు. మున్సిపాలిటీలు, రెవెన్యూ కార్యాలయాలకు అధికారపక్ష నేతలు ఇచ్చిన డైరెక్షన్‌తో వారు పోలీసులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఎవరైనా ఎన్‌ఓసీ కోసం మున్సిపాలిటీకి, కుల ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే చాలు.. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతోంది. దీంతో ఆశావహులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ బైండోవర్ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పోలీసులు మరింతగా బరి తెగించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్న వారికి సీఐలు ఫోన్‌లు చేసి పోలీస్ స్టేషన్‌లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మీరు పోటీ చేస్తే ఎన్నికల్లో గొడవలు జరిగితే మీదే బాధ్యత అంటూ హెచ్చరిస్తున్నారు. గొడవలకు మీపై కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. నామినేషన్ కూడా వేయకముందే బైండోవర్, ఆ తర్వాత ఏదైనా జరిగితే కేసులు పెడతామని పోలీసుల ద్వారా బెదిరిస్తూ చంద్రబాబు సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది.
సోషల్ మీడియానూ వదలని పోలీస్ జులుం..
స్థానిక ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసులు మరింత జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. పోలీసులు పల్నాడు జిల్లాలోని ఒక్క గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే వీడియోలు పెట్టారనే సాకుతో ఏకంగా 600 మందికిపైగా బైండోవర్ చేయడం గమనార్హం. గురజాల మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ‘సెల్ఫీ చాలెంజ్’ విసిరారు. కనీసం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సెల్ఫీ చాలెంజ్ విసిరి సామాన్య ప్రజల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
ఆ వీడియోలు పోస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్‌కు రప్పించి బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, బాగా పనిచేస్తోందని కొందరిని భయపెట్టి కౌంటర్ వీడియోలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి వాళ్ల సురేష్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. వైఎస్సార్‌సీపీ తిరుపూరు నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ జాకీర్‌తోపాటు పలువురు నేతలపై బైండోవర్ పేరుతో కక్ష సాధింపులకు దిగారు.
గ్రామాల్లోనూ బైండోవర్లు..
పట్టణాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దశలో గ్రామాల్లో సైతం పోలీసులు బైండోవర్ల ప్రక్రియకు తెర తీయడం గమనార్హం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇదే దారుణ పరిస్థితి నెలకొంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 15 నుంచి 20 మంది వరకు బైండోవర్లు చేసినట్టు సమాచారం. మాచర్ల, గురజాల, నరసరావుపేటలో ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా రూరల్ మండలంలో తుమ్మింద, గువ్వకల్లు, మురకంబట్టు, నాయని చెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని పథకం ప్రకారం పోలీసులు బైండోవర్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం బైండోవర్ కుట్రలకు పదును పెట్టింది.
పోలీసులు చేయాల్సింది ఇదీ..!
ఎన్నికలు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ/బీఎన్‌ఎస్‌ఎస్) ప్రకారం అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడతారు. పాత నేరస్తులను, షీట్స్ ఉన్న వారిని, గొడవలకు సంబంధించిన ఎక్కువ కేసుల్లో నిందితులను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బైండోవర్ చేస్తారు. ఎటువంటి గొడవలకు పాల్పడబోమని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సొంత హామీ (పూచీకత్తు)తో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారు.
పోలీసులు చేస్తోంది ఇదీ..!
బైండోవర్ ముసుగులో వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి వైఎస్సార్‌సీపీ ఆశావహులను కేసుల పేరుతో బెదిరించి పోటీ నుంచి తప్పించేందుకు చంద్రబాబు సర్కారు పథకం వేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కీలక కార్యకర్తల నుంచి మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు పోలీసులు వరుసగా బైండోవర్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఎన్నికలు ముగిసేవరకు ఎలాంటి రాజకీయ నిరసనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తున్నారు. బాండ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా విపక్షాన్ని టార్గెట్ చేసి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం బైండోవర్, కేసుల పేరుతో పోలీసులను ప్రయోగించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది.
బాబుకు ఓటమి భయం.. చతుర్ముఖ కుతంత్రం!
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండటంతో పోలీసులను పావులుగా వాడుకునేందుకు చంద్రబాబు చతుర్ముఖ కుతంత్రం పన్నారు. యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం.. బైండోవర్ పేరుతో వేధింపులకు పాల్పడటం.. శాంతి భద్రతల పేరుతో స్థానికంగా లేకుండా చేయడం... మలిదశ పోలింగ్ జరిగేలా చేసి అనుకూల పోలీసులు, అధికారులతో లబ్ది పొందే ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై రెండున్నరేళ్లుగా అనేక అక్రమ కేసులను చంద్రబాబు సర్కారు బనాయించింది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీటిని తెరపైకి తెచ్చి బైండోవర్ పేరుతో బెదిరిస్తోంది. కీలకమైన నామినేషన్ల దశలో విపక్ష నాయకులు, కార్యకర్తలు స్థానికంగా లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. పోటీ చేయబోతున్న అభ్యర్థులపై అక్రమ కేసులు మోపి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. కొన్నిచోట్ల మలి దశ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కల్పించి పోలీసులను మోహరించి బూత్‌లను క్యాప్చర్ చేసి ఏకపక్ష ఎన్నికలకు కుటిల వ్యూహం పన్నింది. చట్టానికి లోబడి పనిచేసే అధికారులను గుర్తించి స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఫిర్యాదులు చేయించడం, తమకు అనుకూలమైన వారిని అక్కడకు రప్పించుకోవడం లాంటి అనైతిక చర్యలకు అధికార పక్షం ప్రణాళిక రచించింది.


