
సాక్షి, అమరావతి: కోవిడ్‌తో ఓ వైపు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. నవరత్న పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. నవరత్న పథకాల క్యాలెండర్‌లో ప్రకటించిన తేదీల మేరకు తూచా తప్పకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లోనే ప్రజల చేతికి వివిధ పథకాల ద్వారా రూ.3,440.66 కోట్లను సీఎం అందించడం గమనార్హం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా జగనన్న విద్యా దీవెన కింద తొలి త్రైమాసికానికి, జగనన్న వసతి దీవెన కింద మొదటి విడత నిధులు రూ.1,720 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు.
అలాగే సకాలంలో రుణ వాయిదాలను చెల్లించిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లను వారి ఖాతాల్లోనే వేశారు. అదేవిధంగా 2019–20 రబీలో సకాలంలో రుణాలు చెల్లించిన 6.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో సున్నా వడ్డీ రాయితీగా రూ.128.47 కోట్లను జమ చేశారు. అర్హత ఉన్నా బీమా పరిధిలోకి రాని 12,089 కుటుంబాలకు రూ.254 కోట్లను అందించారు. ఇక కోవిడ్ నియంత్రణలో, ప్రజలకు సంక్షేమ పథకాల నగదు పంపిణీలో విశేష సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లకు రూ.228.74 కోట్ల మేర నగదు బహుమతులు అందజేశారు. కోవిడ్‌తో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినప్పటికీ ఆ కష్టం కన్నా ప్రజల కష్టమే పెద్దదనే భావనతో ఎక్కడా సంక్షేమ పథకాలకు లోటు లేకుండా నిధులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా పోయింది.