
సాక్షి, అమరావతి: ఆ ఆంధ్రప్రదేశ్‌లో ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. 30 శాతం పదో తరగతి, 70 శాతం ఇంటర్ ఫస్టియర్ మార్కులు ప్రాతిపదికగా.. ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామన్నారు. అయితే నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఆగష్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు.