‘గిరి’గీసి మరీ వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

‘గిరి’గీసి మరీ వసూళ్లు

Jun 9 2025 6:51 AM | Updated on Jun 9 2025 6:51 AM

‘గిరి

‘గిరి’గీసి మరీ వసూళ్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

ంచే చేను మేసిన చందంగా మారిపోయిందనే విమర్శలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వ్యవహారంలో వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధానికి కృషి చేయాల్సిన సొంత శాఖకు చెందిన కొందరు అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటుపడి సమాచారాన్ని లీకు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే గతంలో ఓ సీఐ స్థాయి అధికారిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా రిజిస్ట్రేషన్లతో పాటు రవాణాశాఖ నుంచి ప్రతీ నెలా కొద్ది మంది నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. సొంత శాఖకు చెందిన ఓ ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లశాఖ నుంచి మామూళ్లు ముట్టచెప్పడంలో ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నెలా ‘గిరి’గీసి మరీ ఠంచనుగా కొద్ది మంది కీలకమైన అధికారుల నుంచి వసూలు చేసి ముట్టచెబుతున్నట్టు సమాచారం. అయితే ఈ మామూళ్ల వ్యవహారంలో ఎవరెవరికి ఎంత అందుతుందనే విషయంలో మొదలైన చర్చ రచ్చ కావడంతో ఈ వ్యవహారం పైదాకా వెళ్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్టు ఆ శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా అవినీతిని కట్టడి చేయాల్సిన అధికారులే అవినీతి రొంపిలో కూరుకుపోతుండటం మాత్రం విస్తుగొలుపుతోంది.

ముందుగానే సమాచారం లీకు...!

వాస్తవానికి ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది సమర్థులైన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక ఉన్నతాధికారిపై ఎలాంటి ఆరోప ణలు లేకపోయినప్పటికీ, కిందిస్థాయిలో పేరుకుపోయిన కొందరు అవినీతి సిబ్బందిపై ఆయన సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఏసీబీలో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఒక ఎస్‌ఐతో పాటు ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సంస్థ పరువును నెలవారీ మామూళ్ల కోసం బజారున పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రవాణా, జీవీఎంసీ, రెవెన్యూ, మైనింగ్‌ శాఖల నుంచి వీరు నెలవారీ మామూళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న సదరు నలుగురు సిబ్బంది డిపార్ట్‌మెంట్ల వారీగా వసూళ్లకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత శాఖకు ముందుగానే సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారని విమర్శలున్నాయి. ఒకవేళ ఎవరైనా తమ నెలవారీ మామూళ్లకు అంగీకరించకపోతే, వీరే వేరే పేర్లతో ఫిర్యాదు చేసి సదరు అధికారిపై దాడులు చేస్తారనే అపప్రద కూడా ఉంది. ఈ వ్యవహారంలోనే ఒక జీవీఎంసీ అధికారిని కూడా గతంలో ఇదే తరహాలో ఇబ్బంది పెట్టినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అయితే తాము చెప్పినట్లు వింటే వారిపై ఏ ఫిర్యాదు వచ్చినా కాపాడతారనే ధైర్యాన్ని కూడా ఈ సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది.

కీలకంగా డాక్యుమెంట్‌ రైటర్‌...!

ఏసీబీలో నెలవారీ మామూళ్ల వ్యవహారం మరింత ముదురుతోంది. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల నుంచి వసూలు చేసిన మామూళ్లకు సంబంధించి ఒక సీఐను ఇందులో ఇరికించారని తెలుస్తోంది. మొదట్లో తన విధులను మాత్రమే చూసుకునే సదరు సీఐని, నెలవారీ మామూళ్ల రొంపిలోకి లాగి, చివరికి సొంత శాఖ సిబ్బందే ఆయన్ను అడ్డంగా బుక్‌ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో శాఖ పరువు బజారున పడకుండా, ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా గుట్టుగా బదిలీతో సరిపెట్టినట్టు సమాచారం.

ఈ మామూళ్ల వ్యవహారంలో ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులతో సన్నిహి తంగా మెలుగుతూ నెలవారీ మామూళ్లను అందజేస్తున్నట్లు సమాచారం. సదరు డాక్యుమెంట్‌ రైటర్‌ ఓ ఉన్నతాధికారికి (గతంలో పనిచేసిన) అత్యంత సన్నిహితుడని ప్రచారం ఉంది. అందుకే ఎన్నో ఆరోపణలున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖలోని నలుగురైదుగురు అధికారులపై ఎటువంటి చర్యలూ ఉండవనే విమర్శలున్నాయి.

తాజాగా, ఇదే శాఖకు చెందిన ఒక అధికారి అవినీతికి సంబంధించి పక్కాగా కొన్ని వీడియోలు, ఫొటోలతో సహా అందిన ఫిర్యాదును కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ వాణిజ్య భవంతిని నిర్మించి, అద్దెకు పెట్టి అడ్డంగా దొరికినప్పటికీ, ఆ అధికారిని కాపాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఏసీబీ పరువును బజారున పడకుండా ఉండేందుకు రహస్యంగా ఉన్నతస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ నుంచి భారీగా మామూళ్లు?

చక్రం తిప్పుతున్న ఓ డాక్యుమెంట్‌ రైటర్‌

‘గిరి’గీసి మరీ వసూళ్లు 1
1/1

‘గిరి’గీసి మరీ వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement