
నకిలీపత్రాలు సృష్టిస్తున్న ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ప్రభుత్వ శాఖల నకిలీపత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులు సృష్టించే ముఠాను ఆదిలాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న తండ్రి, కుమారుడిపై కేసు నమోదు చేశారు. తండ్రిని అరెస్ట్ చేయగా కుమారుడు పరారీలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లాడ్వే బద్రినాథ్ కుమారుడు రాహుల్‌కుమార్. ఇతను డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా తండ్రి కుమారుడు నకిలీపత్రాలు, స్టాంపులు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. వివిధ జిల్లాల్లో శాఖల అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, పత్రాలు, వాటిని తయారుచేసే రసాయనాలు, పరికరాలు, కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నకిలీ పత్రాలతో అక్రమాలు
మావల మండలంలోని సర్వేనంబర్ 170లోని ప్లాట్ల పత్రాలను మండల రెవెన్యూ అధికారి కేటాయించినట్లుగా సృష్టించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ట్రెడ్ లైసెన్స్ నకిలీపత్రాలు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన, ఆర్టీవో వాహన రిలీజ్ పత్రాలు, ఆధార్‌కార్డులతోపాటు వివాహ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. వివిధ హాస్పిటల్స్‌కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి విక్రయించి లబ్ధిని పొందేలా చూశారు. మహాలక్ష్మి మాన్‌పవర్ అండ్ ప్లేస్మెంట్స్ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నకిలీ ఉద్యోగ నియామకపత్రాలు తయారు చేసి మోసగించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్‌లను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తండ్రి అరెస్ట్, పరారీలో కుమారుడు
కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

నకిలీపత్రాలు సృష్టిస్తున్న ముఠా గుట్టురట్టు