రాజకీయ మార్పునకు శ్రీకారం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:జిల్లాలో రాజకీయాలను మార్పు చేసేందుకు ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళంలోని మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్న సిక్కోలు తిరుగుబాటు బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కూడలి వద్దనున్న వైఎస్ఆర్ మున్సిపల్ కల్యాణ మండపంలో సిక్కోలు తిరుగుబాటు సన్నాహక సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజలు ఎంతగా ఉద్యమించినప్పటికీ వారి మనోభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
ప్రజలతో ఉండాలా? పార్టీతో ఉండాలా? అంటే ప్రజల అవసరాలు తీర్చే పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడడంలో టీడీపీ విఫలమైందని, ఆ పార్టీని ప్రజలు విశ్వసించేస్థితిలో లేరన్నారు. ఒక రాజకీయ పార్టీని ఎందుకు ఎంచుకుంటామంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అన్నారు. అలా ప్రజల అవసరాలు తీర్చే పార్టీగా వైఎస్ఆర్ సీపీ అవతరించిందని, అందుకే ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాదు వంటి నగరాన్ని కోల్పోతామన్నారు. అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఊహించలేదన్నారు.
విభజన వలన సీమాంధ్ర ప్రాంత ప్రజల భవిష్యత్ నాశనం చేసే కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనన్నారు. ప్రజలతోనే ఉండాలని, వారి మనోభావాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానన్నారు. విశాల ప్రయోజనాలు ఆశించే పార్టీ మారడం అని, ఇందుకోసమే ఈనెల 9వ తేదీన చిక్కోలు తిరుగుబాటు బహిరంగ సభ నిర్వహణ అన్నారు. టీడీపీ 17 సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. వైఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, జిల్లాలో 12 వెనుకబడిన కులాలను బీసీ జాబితాలో చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 15 సంవత్సరాలుగా ఓ దినపత్రిక తనపై విషపురాతలను రాస్తునే ఉందని, తనపై రాసిన రాతలను ప్రజలు నమ్మితే 15 ఏళ్ల క్రితమే తాను ఓడిపోయి ఉండాల్సిందన్నారు.
ధర్మాన రాకను స్వాగతిద్దాం: కృష్ణదాస్
ప్రసాదరావు రాజకీయాల్లో ఎంతో పరిణతి చెందిన వ్యక్తని, అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అవుతుందని, అటువంటి వ్యక్తి రాకను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 9వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రానున్నార ని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ ధర్మాన వంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడి వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారంటే ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులు పనిచేసినా అభివృద్ధి మాత్రం ధర్మాన ప్రసాధరావు హయాంలోనే జరిగిందన్నారు.
టీడీపీ నాయకుడు చల్లా రవికుమార్ మాట్లాడుతూ 9న జరగనున్న సభను విజయవంతం చేసిసత్తాను చాటుదామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహంలు మాట్లాడుతూ సభను విజయవంతం చేసేం దుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ధర్మాన అనుచరులు ధర్మాన రాంమనోహర్‌నాయుడు, గొండు కృష్ణమూర్తి, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, కె.ఎల్.ప్రసాద్, మార్పు మన్మధరావు, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషొత్తం, టి.మోహిని, మూకళ్ల సుగుణ, మూకళ్ల తాతబాబు, హనుమంతు కృష్ణారావు, బరాటం రామశేషు, కలగ జగదీష్, చిట్టి జనార్ధనరావు, ముంజేటి కృష్ణ పాల్గొన్నారు.