నష్ట నివారణ చర్యల్లో ఇన్ఫీ యాజమాన్యం..
వ్యవస్థాపకులతో చర్చించిన చైర్మన్ శేషసాయి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్‌పై వ్యవస్థాపకులతో విభేదాలు మరింతగా ముదరకుండా ఇన్ఫోసిస్ యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వ్యవస్థాపకులతో చర్చలు జరిపినట్లు సంస్థ చైర్మన్ శేషసాయి తెలిపారు. ‘ఆదివారం నాడు వ్యవస్థాపకులతో భేటీ అయ్యాను. నిష్పక్షపాతంగా చర్చించాం. వారు ఇచ్చే సూచనలన్నింటినీ అమలు చేయాలంటే మాకూ కొన్ని పరిమితులు ఉంటాయన్న సంగతి వివరించాను. ఏదైనా సరే రెండు వర్గాలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అంతే తప్ప బహిరంగంగా జరిగితే సంస్థకే నష్టం వాటిల్లుతుంది.
అందుకే ఇకపై ఇలాంటి విషయాలకు మీడియా వేదిక కాకూడదని నిర్ణయించుకున్నాం’ అని ఆయన వివరించారు. మరోవైపు, కంపెనీపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు శేషసాయితో కలిసి ఇన్ఫీ సీఈవో విశాల్ సిక్కా వరుసగా రెండో రోజునా ప్రయత్నాలు కొనసాగించారు. మాజీ సీఎఫ్‌వో బన్సాల్‌కి భారీ ప్యాకేజీ అంటూ బైటపెట్టినవారి ఆలోచనా విధానం దుర్మార్గమైనదిగా సిక్కా అభివర్ణించారు. ఇది నిర్లక్ష్యమైన, విషపూరితమైన చర్యని.. తనపై వ్యక్తిగత దాడి అని ఆయన పేర్కొన్నారు. గవర్నెన్స్ లోపాలున్నాయన్న ఆరోపణలపై తమ క్లయింట్లెవరూ కూడా ప్రశ్నించలేదని, పైగా గట్టిగా మద్దతు తెలిపారని సిక్కా చెప్పారు. గడిచిన మూడు–నాలుగు రోజులుగా పెద్ద క్లయింట్లు కూడా మద్దతు తెలుపుతూ అనేక ఈమెయిల్స్ పంపినట్లు ఇన్వెస్టర్లకు ఆయన వివరించారు.
ఇన్ఫీ ప్యాకేజీ వివరాలు వెల్లడించలేదు: పాయ్
ముంబై: రాజీవ్ బన్సాల్ నిష్క్రమణ సందర్భంలో కంపెనీ యాజమాన్యం ప్యాకేజీ వివరాలు వెల్లడించకుండా తొక్కిపెట్టి ఉంచిందని ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆరోపించారు. ‘సీఎఫ్‌వో (బన్సాల్) రాజీనామా చేస్తున్నారంటూ 2015 అక్టోబర్‌లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో సీఎఫ్‌వో, సీఈవోలిద్దరూ ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఏకంగా రూ. 17.3 కోట్ల ప్యాకేజీని బన్సాల్‌కి ఇస్తున్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లోనూ వెల్లడించలేదు’ అని పాయ్ తెలిపారు. మీడియాకు ఉప్పందిన విషయం తెలిసిన తర్వాతే.. ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్యాకేజీ వివరాలను వార్షిక నివేదికలో పొందుపరిచిందన్నారు.