పెళ్లి కాని సీఎంలు పెరిగిపోతున్నారు..! | Bachelor CMs' club has a new entrant in Yogi Adityanath | Sakshi
Sakshi News home page

పెళ్లి కాని సీఎంలు పెరిగిపోతున్నారు..!

Published Sun, Mar 19 2017 8:14 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

దేశంలో పెళ్లికాని ముఖ్యమంత్రుల జాబితా పెరిగిపోతోంది.

న్యూఢిల్లీ: దేశంలో పెళ్లికాని ముఖ్యమంత్రుల జాబితా పెరిగిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జాబితాలో చేరారు. 44 ఏళ్ల ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ మఠాధిపతి. వివాహం, కుటుంబానికి దూరంగా ఉన్న యోగి.. సన్యాసం స్వీకరించారు. గోరఖ్‌ పూర్‌ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ సీఎంగా ప్రమాణం చేశారు.

ఇటీవలే ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ (56) కూడా బ్రహ్మచారే. ఇక హరియాణ, అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు వరుసగా.. ఎంఎల్ ఖట్టర్ (62), సర్బానంద సోనోవాల్ (54), నవీన్ పట్నాయక్‌ (70), మమతా బెనర్జీ (62) లు కూడా అవివాహితులే. వీరిలో నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మినహా మిగిలిన ముఖ్యమంత్రులు బీజేపీ వారు కావడం గమనార్హం. 2000 సంవత్సరం నుంచి ఒడిశా సీఎంగా నవీన్ కొనసాగుతున్నారు. ఇక మమత వరుసగా రెండో పర్యాయం బెంగాల్ సీఎం అయ్యారు. వీళ్లలో చాలామంది ఎన్నికల ప్రచారంలో పెళ్లి కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాము అవివాహితులమని, తమకు కుటుంబం లేదని, తాము మీ వాళ్లమేనని.. కుటుంబ పాలనకు, అవినీతికి చోటు ఉండదని ప్రజలను ఆకట్టుకున్నారు.

దేశ రాజకీయాల్లో అవివాహితులైన ప్రముఖుల జాబితా పెద్దదే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (46)కి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావిస్తే.. తనకు నచ్చిన అమ్మాయి దొరికినపుడు పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇక మాజీ ముఖ్యమంత్రులు మాయావతి (ఉత్తరప్రదేశ్‌-61), ఉమాభారతి (మధ్యప్రదేశ్‌-57), తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అవివాహితులే. ఉమా భారతి ప్రస్తుతం కేంద్ర మంత్రి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా వివాహం చేసుకోలేదు. దేశ వ్యాప్తంగా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఈ జాబితాలో ఉన్నారు. ఇతర పార్టీల కంటే బీజేపీలోనే బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement