పాతాళానికి చేరిన భూగర్భజలం

Underground Water Levels Decreased Mahabubnagar - Sakshi

ఇక్కడ కనిపిస్తున్న పొలం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మాచన్‌పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్‌రెడ్డిది. ఇతనికి 20 ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు బోర్లలో రెండింట్లో నీటిమట్టం పడిపోయింది. మరో రెండు బోర్లలో అంతంతమాత్రంగానే నీళ్లు వస్తున్నాయి. ఇరవై ఎకరాల రైతు గత రబీ సీజన్‌లో నాలుగున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే ఈ ఏడాది రబీలో నీళ్లు లేక కేవలం అర ఎకరంలో సాగుచేస్తున్నాడు. రైతులందరికీ ఇదే పరిస్థితి. ప్రతిఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనడానికి ఇదొక నిదర్శనం. వర్షాలు కురవక భూగర్భ జలాలు పడిపోతుండటంతో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. కోయిల్‌సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ను మహబూబ్‌నగర్‌ రూరల్, కోయిలకొండ మండలాల్లోని 
చెరువుల్లోకి నింపితే రైతులు పంటలను సాగు 
చేసుకునే అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్‌ రూరల్‌: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఆరేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా నీటిమట్టం పాతాళానికి చేరింది. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు సమస్య ఇలాగే ఉంది. 2013లో కురిసిన భారీ వర్షం తప్పా మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు. అప్పటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తాయి.  ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు, బోరుబావులు వట్టిపోయి పంటల సాగు కష్టతరంగా మారింది. ప్రస్తుత రబీ సీజన్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ, జొన్న, శనగ తదితర పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

వేసవి రాకముందే.. 
వేసవి రాకముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడం, మరోవైపు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీరు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చిన్ననీటి వనరులు చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. రైతులు రబీ పంటలపై ఆశలు వదులుకున్నారు. కనీసం పశువులకు నీరు దొరకే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు.

అన్నం పెట్టే రైతన్నకు వివిధ పంటల సాగులో చేతినిండా పని లేకుండా పోవడంతో ఇతర పనులపై ఆధార పడాల్సి వస్తోంది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది సాగుకు నీరు వదలరాదని సంబంధిత అధికారులు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. ఈ కారణంగా అక్కడ కూడా పంటల సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. బోరుబావుల కింద మాత్రం రైతులు సేద్యం చేస్తున్నారు. ఆ బోర్లు కూడా ఎప్పుడు ఎండిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో ఐదు ఎకరాలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం రెండు ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

తగ్గిన సాగు విస్తీర్ణం 
జిల్లాలో ఈ ఏడు రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది వరి 22,500 హెక్టార్లు, వేరుశనగ 17వేల హెక్టార్లు, జొన్నలు 1000 హెక్టార్లు, శనగ వంటి చిరు ధాన్యాలు మొత్తం 1,930 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఏడు రబీ సీజన్‌లో వరి 15వేల హెక్టార్లు, వేరుశనగ 7,700 హెక్టార్లు, జొన్నలు 744 హెక్టార్లు, శనగలు 545 హెక్టార్లు, చిరు «ధాన్యాల వంటి పంటలు 1,415 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులంతా తమ బోరుబావుల్లో ఉన్న నీటిని బట్టి డ్రిప్‌ పద్ధతిని వినియోగిస్తూ ఆరుతడి పంటలు పండిస్తున్నారు. 

పాతాళానికి చేరిన జలం 
భూగర్భజలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరీ పాతాళానికి వెళ్లిపోయాయి. ఖరీఫ్‌ గట్టెక్కినా రబీ పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీటితోపాటు తాగునీటికీ సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భ జలాలు 11.69 మీటర్ల వద్ద ఉండగా 2019 జనవరిలో 15.87 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 4.18 మీటర్లకు పడిపోయింది. నారాయణపేట మండలం అప్పారెడ్డిపల్లిలో భూగర్భజలాలు మరింత లోతుకు చేరాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా ఇక్కడ 15.79 మీటర్ల లోతుకు పడిపోయాయి.

అదేవిధంగా గండీడ్‌ మండలం సల్కార్‌పేటలో 15.10 మీటర్లు, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో 11.88 మీటర్లు,  ఊట్కూర్‌ మండలం పులిమామిడి గ్రామంలో 8.65 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే నీటి ఎద్దడి తప్పదు.

వర్షపు నీటిని నిలువ చేస్తేనే.. 
వర్షపు నీటిని నిలువ చేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి వెళ్లే జీవనదులు, వాటికి అడ్డుగా ఆనకట్టలు కడితేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా వెళ్లే వరద నీటికి అడ్డుకట్ట వేసి సద్వినియోగం చేసుకుంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఉంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. 

ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి 
వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. నీటిని పొదుపుగా డ్రిప్‌ను వినియోగిస్తూ ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు సేద్యం చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు.  – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top