కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌ ఆంక్షలపై ఉత్కంఠ! | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌ ఆంక్షలపై ఉత్కంఠ!

Published Sun, Apr 19 2020 3:16 PM

Telangana Cabinet Meeting On Sunday Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను ప్రగతిభవన్‌లో ఈ భేటీ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఏప్రిల్‌ 20 నుంచి కొంతమేర సడలింపు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలను సైతం కేంద్రం విడుదల చేసింది. అయితే నేడు జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ముఖ్యంగా వీటిపైనే చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే  ఎజెండా కూడా తయారు చేశారని, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్‌ గడిచిన రెండు రోజులుగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం..!
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో కరోనా సంఖ్య పెరుగుతుండటంతో.. లాక్‌డౌన్‌ సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం విముకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మినహాయింపులు ఇస్తే ఏఏ రంగాలకు ఇవ్వాలి..? వేటికి కొనసాగించాలని అనే దానిపై నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్‌ భేటీ అనంతం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా  కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

పెరుగుతున్న కరోనా కేసులు..
వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటివరకు 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అలాగే 18 మంది కరోనా బారినపడి మరణించారు.

Advertisement
Advertisement