సత్వర విచారణకు అవకాశాలు చూడండి

High Court on Kaleshwaram petitions - Sakshi

కాళేశ్వరం పిటిషన్లపై హైకోర్టు 

పునరావాసం, పునర్నిర్మాణ వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయండి

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన వ్యాజ్యాల సత్వర పరిష్కారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు గ్రీన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాల్లో అత్యధిక వ్యాజ్యాలు వ్యక్తిగత భూసేకరణకు సంబంధించినందున, వాటి పరిష్కారానికి ఏం చేస్తారో తెలియచేయాలంది. పునరావాసం, పునర్ని ర్మాణం కోసం దాఖలైన వ్యాజ్యాల్లో పూర్తి వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావుల గ్రీన్‌బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాల కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోకూడదంటూ, ఈ వ్యాజ్యాల విచారణకు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యే కంగా గ్రీన్‌బెంచ్‌ ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం ఈ బెంచ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ కేసులను విచారిస్తుంది. అందులో భాగంగా శుక్రవారం పలు కేసులు విచారణకు వచ్చాయి.  

ఇష్టమొచ్చినట్లు స్వాధీనం.. 
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, హైకోర్టు స్టే ఉత్తర్వులు ఎత్తివేయడంతో వీటిని సాకుగా చూపుతూ అధికారులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. పునరావాసం, పునర్నిర్మాణం గురించి పట్టించుకోవట్లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి ఓసారి అది కూడా మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకే విచారణ జరిపితే, ఎప్పటికీ ఈ వ్యాజ్యాలు పరిష్కారానికి నోచుకోవని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 7 వేల ఎకరాల భూమి అవసరమన్నారు. ఇందులో 0.2 శాతం భూమిపైనే వివాదం ఉందని కోర్టుకు నివేదించారు. మరి అలా అయితే తమ ముందు ఎందుకు వందల కొద్ది వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. ఎప్పుడో ఊరు వదిలి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు వచ్చి పరిహారం కోరుతున్నారని రామచంద్రరావు చెప్పారు. కాళేశ్వరంతో ప్రాజెక్టుతో సంబంధం లేని వారు కేసులు దాఖలు చేస్తున్నారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కాళేశ్వరంతో సంబంధం లేని కేసులన్నింటినీ కూడా తమ ముందున్న జాబితా నుంచి తొలగించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top