దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి!  | Sakshi
Sakshi News home page

దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి! 

Published Sun, Aug 18 2019 1:42 AM

Dgp Mahender Reddy Says Crimes cannot be reduced with Executions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రక్షణ, స్త్రీల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణ, సాక్ష్యాలతో కూడిన పోలీసింగ్, ప్రామాణిక సేవలను రాష్ట్రమంతా ఒకేలా అందించడం.. పోలీసుల లక్ష్యమని, రానున్న ఐదేళ్లపాటు ఈ లక్ష్యాల పూర్తిస్థాయి సాధనకు కృషి చేస్తున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. పార్క్‌ హయత్‌లో శనివారం ఫిక్కీ మహిళా సంస్థ ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఉమెన్‌ సేఫ్టీ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఫిక్కీ చైర్‌పర్సన్‌ సోనా చత్వానిసహా వంద మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర రక్షణ, భద్రత విషయంలో పలు ప్రశ్నలకు డీజీపీ సమాధానాలిచ్చారు.  

భయపడితే చాలు... 
‘ఉరిశిక్షలు వేస్తే నేరాలు తగ్గవు. కానీ నేరానికి కచ్చితంగా శిక్ష పడుతుంది.. తప్పించుకోలేం అనే భయం నేరస్తుల్లో గుబులు పుట్టిస్తుంది. 24 నుంచి 48 గంటల్లోపే చాలా కేసులను ఛేదించాం. వరంగల్‌లో 9 నెలల పాప అత్యాచారం కేసుతో పాటు అనేక సంచలన కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చేయడంలో విజయం సాధించాం. అత్యవసర సేవల నిర్వహణలో భాగంగా సమాచారం అందితే నగరంలో 5 నిమిషాల్లో, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 10 నిమిషాల్లో, గ్రామాల్లో 15 నిమిషాల్లో స్పందిం చగలుగుతున్నాం. డిజిటల్‌ వేదికగా నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, నేరస్తులను పట్టుకునేందుకు తగిన శిక్షణ పోలీసులకు అందిస్తున్నాం.’అని మహేందర్‌రెడ్డి చెప్పారు 

ప్రతి పౌరుడూ పోలీసే... 
‘70 ఏళ్లలో సాధ్యం కానిది.. ఈ ఐదేళ్లలో సాధించాం. పోలీసు విభాగానికి 11,500 వాహనాలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే కావచ్చు. రెండు శాతం జనాభా మాత్రమే పోలీసు సేవలను వినియోగిస్తోంది. మిగిలిన 98 శాతం మంది కూడా పన్ను కడుతున్నవారే. వాళ్లు మా దగ్గరికి రారు. అందుకే మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి పౌరుడూ పోలీసే.. ప్రతి పోలీసూ పౌరుడే. ప్రజలతో కలసి పనిచేయకపోతే, వాళ్లకు ఉపయోగపడకపోతే మా సేవలకు అర్థం ఉండదు.’అని బదులిచ్చారు. 

బలప్రయోగం చివరియత్నం.. 
‘నేరం జరిగిన తర్వాత కంటే ముందు దాన్ని నిలువరించడమే పోలీసుల సమర్థత. బలప్రయోగం అనేది ఏ ప్రయత్నాలు ఫలించనప్పుడు చివరగా చేసేది. సంతకాల వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులతో ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రక్రియ సాధ్యం కావటం లేదు. అయితే మన దగ్గర ఫిర్యాదు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుని సంతకాలు మాత్రం స్వయంగా వెళ్లి ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్‌ చేసుకుంటారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలను రెగ్యులరైజ్‌ చేస్తున్నాం. నగరంలో 4 వేల సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా, అందులో 200 ఏజెన్సీలకే పీఏఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్‌ ఉన్నాయి.

స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మూడవ పార్టీ మానిటర్‌ చేస్తుంటుంది. ఫీడ్‌ మెకానిజం ఏర్పాటు చేయటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. లింగ వివక్ష లేకుండా, సున్నితంగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాం.
– స్వాతి లక్రా 

ముఖాముఖి కార్యక్రమం 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏకకాలంలో ఫిక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రిపోర్ట్‌ను ఆయా ప్రభుత్వాలకు అందజేస్తాం.
– సోనా చత్వాని

Advertisement
Advertisement