చెదరని అవినీతి మరక

Corrupt Government Employees In Mahabubnagar - Sakshi

సాక్షి, జడ్చర్ల: ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. మొన్నటికి మొన్న ఓ తహసీల్దార్‌ భారీగా అవినీతికి పాల్పడి కటకటాలపాలైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేఫథ్యంలో ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం అవగాహన కల్పించింది. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్‌ చేయండి అంటూ జిల్లావ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఇస్తూ ప్రజలకు, ఉద్యోగులకు అవగాహన కల్పించినా కొందరు అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేయడమే గాక అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా మిడ్జిల్‌ మండలంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ పట్టుబడిన విషయం చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో ఇలా..
జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులను ఏసీబీ అధికారులు పట్టు కున్న సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. గత ఐదే ళ్ల కాలంలో పలువురు అధికారులు, సిబ్బంది లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డారు. గతంలో బాలానగర్‌ మండలం గిర్ధావర్‌ రవీందర్‌రెడ్డి మల్లెపల్లికి చెందిన రైతు కృష్ణ్ణయ్య నుంచి అతని వ్యవసాయ భూమిని విరాసత్‌ చేసేందుకు గాను రూ:4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు మిడ్జిల్‌ మండల ఎస్‌ఐ సాయిచందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిడ్జిల్‌ మండలంలో ఊర్కొండ గ్రామ వీఆర్‌ఓ వెంకటేశ్వర్‌రెడ్డిని జడ్చర్లలో ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అలాగే జడ్చర్ల ఎస్‌ఐ విఠల్‌రెడ్డిని ఏసీబీ అధికా>రులు పట్టుకున్నారు.

అనంతరం జడ్చర్ల విద్యుత్‌ శాఖ ఏఈ రాజశేఖర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. తర్వాత బాలానగర్‌ మండలం అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శశికళ అంగన్‌వాడీ కార్యకర్త నాగమణి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాలానగర్‌ తహసీల్దార్‌ మురళీకృష్ణ, వీఆర్‌ఓ శివరాములును ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. జడ్చర్లలో పెద్దఆదిరాల వీఆర్‌ఓ  కాశీనాథ్‌ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇలా లంచాల రూపంలో ప్రజలను జలగల్లా పీడిస్తున్న అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు తమదైన శైలిలో పట్టుకుని అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.

మార్పు వచ్చేనా..?
ప్రజల నుంచి లంచాలు తీసుకునే విశ సం స్కృతి నుంచి కొందరు అధికారులు ఇంకా బ యట పడడం లేదు. ఏసీబీ అధికారుల దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నారే తప్ప అవినీతికి చరమగీతం పాడి ప్రజలకు నిజాయితీగా సేవలందించాలన్న ఆలోచన చే యకపోవడం విచారకరమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అవినీతి అధికారులు మైండ్‌ సెట్‌ మార్చుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవలందించే విధంగా కృషి చేయా లని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రతి పనికీ లంచమే..
కాగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం లేనిదే చేయి కదలని పరిస్థితి దాపురించింది. ఇక్కడ.. అక్కడ అని కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్, ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, నీటి పారుదల, ఇంజనీరింగ్‌ కార్యాలయాలతోపాటు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తదితర కార్యాలయాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని వాపోతున్నారు. మనీ ముట్టజెప్పితే పనులు ఆగమేఘాల మీద పూర్తవుతాయని.. లేదంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫోన్‌ నంబర్లు ఇవ్వడం, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉండడం తదితర వాటిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా అవగాహన కల్పిస్తే అవినీతి అధికారుల ఆట కట్టించే పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు.

మాకు సమాచారం ఇవ్వండి
వివిధ పనులు నిమిత్తం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి లంచాలు ఇవ్వవద్దు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, ఇతర ఉద్యోగుల సమాచారం మాకు ఇవ్వండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఆయా సేవలను ఉచితంగా అందజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే తమను సంప్రదించాలి. 
– కృష్ణగౌడ్, ఏసీబీ డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top