పాఠశాలల్లోని విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం రూపొందిం చిన నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు.
అకృత్యాలు పునరావృతమైతే క్రిమినల్ కేసులు
స్కూళ్ల యాజమాన్యాలను హెచ్చరించిన సీఎం సిద్ధు
అత్యాచారాలపై చలించిన ముఖ్యమంత్రి
ఘనంగా కన్నడ రాజ్యోత్సవాలు
సాక్షి, బెంగళూరు : పాఠశాలల్లోని విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం రూపొందిం చిన నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. ఇందుకు గాను అన్ని పాఠశాలలకు ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని కంఠీరవ స్టేడియంలో 59వ కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించడానికి ఏదో ఒక కారణం చెబుతూ రాష్ట్రం లోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై ఇలాంటి వాటిని సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా బెంగళూరులో ఇటీవల చిన్నారులపై పాఠశాల్లోనే అత్యాచారాలు జరగడం తనను కలిచివేసిందన్నారు. ఇకపై ఇలాంటి అకృత్యాలు పునరావృతమైతే ఆయా పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై గూండా యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తున్నామన్నారు.
ఇలాంటి కేసులు విచారించడానికి వీలుగా ఫాస్ట్‌ట్రాక్ కేసులను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నామని సిద్ధరామయ్య తెలిపారు. పాఠశాలలు, కళాశాల చుట్టూ పోలీసుల గస్తీని పెంచనున్నామన్నారు. ప్రాథమిక తరగతుల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా ప్రస్తుత చట్టాల్లో మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముందుకు రావాలన్నారు. అఖండ కర్ణాటక తమ లక్ష్యమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా కర్ణాటకను విభజించాలని ప్రయత్నిస్తే సహించబోమన్నారు. ప్రజలు కూడా అటువంటి వారికి బుద్ధిచెబుతారని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
అపశ్రుతి...
కర్ణాటక 59వ రాజ్యోత్సవాల్లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. కల్బుర్గి (గుల్బర్గా), బెళగావి (బెల్గాం)లు ఇందుకు వేదికైంది. ఎంఈఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నల్లని దుస్తులు ధరించి బెళగావిలోని సంభాజి మైదానంలో కర్ణాటక ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెళగావిను మహారాష్ట్రలో కలపాలని నినదించారు. పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్-కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర చేయాలని హై-క ఒక్కూట సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హై-కకు ప్రత్యేక పతాకాన్ని రూపొందించి దాన్ని కల్బుర్గి పట్టణం నడిబొడ్డున ఎగురవేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికులకు... సంఘం సభ్యులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘం నాయకుడైన రాజుతో పాటు సభ్యులను అదుపులోకి తీసుకుని వేరొకచోటకు తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుముణిగింది.