ఉరి కంబాన్ని ఎక్కే క్షణాలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు నాలుగు వారాల పాటు మరణ శిక్షను వాయిదా వేయడంతో రెండు నిండు ప్రాణాలకు తాత్కాలిక ఊరట లభించింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉరి కంబాన్ని ఎక్కే క్షణాలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు నాలుగు వారాల పాటు మరణ శిక్షను వాయిదా వేయడంతో రెండు నిండు ప్రాణాలకు తాత్కాలిక ఊరట లభించింది. చామరాజ నగర జిల్లా కొల్లెగాల తాలూకా భద్రయ్యనహళ్లికి చెందిన జడెస్వామి, శివులు 18 ఏళ్ల శివమ్మపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ఉరి శిక్షకు గురైనసంగతి తెలిసిందే. గురువారం శిక్ష అమలవుతుందని అనుకుంటున్న తరుణంలో సుప్రీం కోర్టు బుధవారం... శిక్షను నాలుగు వారాల పాటు అమలు చేయకుండా స్టే జారీ చేసింది.
తమను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని దోషులు విన్నవించుకోవడంతో ప్రధాన న్యాయమూర్తి పీ. సదాశివం, న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిని తాత్కాలికంగా వాయిదా వేసింది. 12 ఏళ్ల కిందట వీరిపై కేసు నమోదైంది. ఆరోపణలు రుజువు కావడంతో చామరాజ నగర కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టు, సుప్రీం కోర్టులు సమర్థించాయి. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. అనంతరం వారి న్యాయవాది విశ్వనాథన్ ఉరి శిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని అభ్యర్థించారు.
క్షమాభిక్ష అర్జీపై నిర్ణయం తీసుకోవడానికి ఆరున్నరేళ్ల పాటు సుదీర్ఘ జాప్యం చేశారని వాదించారు. ఈ కాలంలో తన క్లయింట్లు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఉరి శిక్షపై స్టే విధించింది.
శివు అఘాయిత్యం
ఎటూ ఉరి తప్పదని గ్రహించిన శివు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టైల్ ముక్కతో చేయి, మర్మాంగాన్ని కోసుకోవడంతో పోలీసులు అతనిని హుటాహూటిన బెల్గాం జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివు, జడెస్వామిలు ప్రస్తుతం బెల్గాం జిల్లా హిండలగా జైలులో ఉన్నారు. మంగళవారం బంధువులు వారిని పరామర్శించిన సమయంలో కన్నీరు మున్నీరయ్యారు. మరణ ఘడియలు దగ్గర పడ్డాయని రోదించారు. గురువారం ఉదయం వీరిద్దరికీ ఉరి శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ తరుణంలో శివు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని పోలీసులు బెల్గాం జిల్లా వైద్యశాలకు తరలించారు. అతనికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు.