100 కోట్లకు స్టేడియం పేరు!

iconic Wankhede Stadium could be renamed in potential Rs 100 crores

సాక్షి, ముంబై : నగరంలో ప్రసిద్ధి చెందిన వాంఖెడే క్రికెట్‌ స్టేడియం పేరు త్వరలోనే మారబోతుంది. రిలయన్స్‌ వాంఖెడే, డీడీబీ ముద్ర వాంఖెడే, బేస్‌లైన్‌ వాంఖెడే....మూడింటిలో ఒక్క పేరు ఖరారు కానుంది. వాంఖెడే క్రికెట్‌ స్టేడియంకు యజమాని అయిన ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ వాంఖెడే స్టేడియం పేరును అమ్మకానికి పెట్టగా రిలయెన్స్, డీడీబీ ముద్ర, బేస్‌లైన్‌ కంపెనీలు పోటీ పడ్డాయి. ఐదేళ్ల కాలానికిగాను 100 కోట్ల రూపాయల చెల్లించి పేరు హక్కులను కొనుగోలు చేసేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయి. వాంఖెడే పేరును అలాగే ఉంచి ఆ పేరుకు ముందుగానీ, లేదా వెనకగానీ తమ కంపెనీ బ్రాండెడ్‌ పేరును పేరు  హక్కులు దక్కించుకున్న కంపెనీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడు కంపెనీల ప్రతినిధులతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ తుది చర్చలు జరుపుతోంది.

మాజీ ముంబై క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ వేత్త ఎస్‌కే వాంఖెడే పేరుతో ఈ స్టేడియంను నిర్మించారు. నాగపూర్‌లో జన్మించిన శేశ్‌రావు కష్ణారావు వాంఖెడే లండన్‌లో లా చదువుకొని నాగపూర్‌లో ప్రాక్టీస్‌ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. జైలుకెళ్లారు. నాగపూర్‌ మేయర్‌గా పనిచేశారు. అప్పటి ముంబై రాష్ట్రానికి ఎన్నికై డిప్యూటి స్పీకర్‌గా, మహారాష్ట్ర శాసన సభకు ఎన్నికై స్పీకర్‌గా పనిచేశారు. భారత క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా పనిచేశారు.

భారత్‌లో ఓ స్టేడియం పేరును ఇలా అమ్మకానికి లేదా లీజ్‌కు పెట్టడం ఇది రెండవసారి. పుణె శివారులో కొత్తగా నిర్మించిన సహరా స్టేడియం పేరు హక్కులను 2013లో సహరా ఇండియా పరివార ం కంపెనీ 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఒప్పందం మేరకు అందులో 98 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించకపోవడంతో సహరా స్టేడియం పేరును మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంగా మార్చివేశారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలా స్టేడియం పేర్లను అమ్మడం సాధారణమే. లండన్‌లోని ఎమిరేట్స్‌ స్టేడియం  హోమ్‌ ఆఫ్‌ ఆర్సనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌గా మారింది. అలాగే లాస్‌ఏంజెలిస్‌లోని స్టాపుల్స్‌ సెంటర్‌ ఎల్‌ఏ లేకర్స్‌ బాస్కెట్‌బాల్‌ టీమ్‌గా పేరు మార్చుకుంది. పాశ్చాత్య దేశాల్లో 1912లో ఈ పేర్లు అమ్మే ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటికీ కొనసాగుతోంది. పలు స్టేడియంలు ఇప్పటికి పలు పేర్లు మార్చుకున్నాయి.

భారత్‌లో ఇలా పేర్లు అమ్మకానికి పెట్టే పద్ధతి ఇంత ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఎక్కువ వరకు స్టేడియంలు ప్రభుత్వమే నిర్మించడం లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించడమని క్రీడా విశ్లేషకులు తెలియజేశారు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు స్టేడియంలను నిర్మిస్తాయి కనుక వారు డబ్బుల కోసం పేర్లను విక్రయిస్తారు లేదా స్పాన్సర్‌ షిప్‌ల కోసం ఇస్తారని వారు చెప్పారు. భారత్‌లో క్రికెట్‌ అసోసియేషన్లకు మినహా ఏ అసోసియేషన్లకు సొంత స్టేడియంలు లేవని వారన్నారు. పైగా పాశ్చాత్య దేశాల్లో ఏడాదంతా క్రీడా పోటీలు కొనసాగుతాయని, భారత్‌లో అతిపెద్ద లీగ్‌ మ్యాచ్‌ అయితే నాలుగు నెలలు కొనసాగుతుందని చెప్పారు. లీగ్‌ మ్యాచ్‌లను స్పాన్సర్‌ చేస్తున్న వాళ్లే భారత్‌లో స్టేడియం పేర్లను కూడా కొనుగోలు చేస్తే క్రీడల ప్రోత్సాహానికి నిధులు మరిన్ని సమకూరుతాయని వారు అభిప్రాయపడ్డారు.

ఇలా పేర్లు అమ్మడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. క్రీడలను స్పాన్సర్‌ చేసే కంపెనీలు ఎలాంటి బ్రాండెyŠ  యాడ్స్‌లేని స్టేడియంలు తమకు కావాలని సహజంగా డిమాండ్‌ చేస్తాయని వారన్నారు. విదేశాల్లో ఎక్కువ స్టేడియంలు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందుల వారికి రాకపోవచ్చని అన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top