శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

BCCI Ombudsman reduces S Sreesanth's life ban to 7 years - Sakshi

జీవిత కాలం నుంచి ఏడేళ్లకు తగ్గింపు

బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశం  

న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్‌ శంతకుమరన్‌ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్‌ సందర్భంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ముందుకు వెళ్లింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌... మూడు నెలల్లో డీకే జైన్‌ సమీక్ష చేపడతారని పేర్కొంది.

తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్‌... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్‌ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్‌ కెరీర్‌ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్‌ పేర్కొన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్‌ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్‌ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్‌ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్‌ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్‌ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top