
ఆ 16 పేజీలు
అక్కడ మట్టి వాసన ఉంటుంది. ప్రేమ పరిమళం ఉంటుంది. కష్టం ఉంటుంది. సుఖం కూడా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. కన్నీరు ఉంటుంది.
అక్కడ మట్టి వాసన ఉంటుంది. ప్రేమ పరిమళం ఉంటుంది. కష్టం ఉంటుంది. సుఖం కూడా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. కన్నీరు ఉంటుంది. తనకి లేకపోయినా ఎదుటివాడికి పెట్టాల నే నిస్వార్థం జీవితంతో కలగలిసిపోయి ఉంటుంది. స్పందించే గుణం ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించే గుప్పెడు మనసూ ఉంటుంది. వీటన్నింటిని తనలో ఇముడ్చుకున్న పల్లెలు ఉంటాయి. పల్లెల ముఖచిత్రాన్ని చిత్రించే చోటుకు కొదవ వుండదు. అందుకే జిల్లా టాబ్లాయిడ్లు అంటే నిజంగానే నాకు గౌరవం.
జిల్లా మొత్తాన్ని 16 పేజీల్లో ఇముడ్చుకొని ప్రధాన సంచికలో ఒదిగిపోయి ఉండే టాబ్లాయిడ్లు అంటే ఒకింత ప్రేమ కూడా. ఈ ఏడు సంవత్సరాల్లో దాదాపు నాలుగు సంవత్సరాలపాటు వాటిని తీర్చిదిద్దే బాధ్యత ఎప్పుడూ బరువు అనుకోలేదు. ఈ క్రమంలో మంచి కథనాలకు పొంగిపోయిన సందర్భాలెన్నో. హృదయపు పొరల్ని కదిలించి కన్నీటి చెలమలో నీటి సుడిగుండాలు సృష్టించిన మానవీయ కథనాల తడి ఇంకా ఆరలేదు. రైతులు, విద్యార్థులు, శ్రామికులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, గిరిజనులు, రాజకీయ నాయకులు... అందరికీ ఒకే కోరిక. సాక్షి టాబ్లాయిడ్‌లోని ఆ 16 పేజీల్లో మాకూ కొంత చోటు దొరికితే బాగుండు అని.
మా ఊరి పేరు పేపర్లో చూసుకోవాలనే ఆశ నాకు ఉంది. ఊరిపేరు కనపడితే దగ్గరతనం కనపడుతుంది. సాక్షి టాబ్లాయిడ్లది కూడా అదే ఫిలాసఫీ. స్థానిక ప్రజలకు సంబంధించిన వార్తల్ని, వారికి అర్థమయ్యే రీతిలో, కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంత మాండలికంలో చేరవేసే బాధ్యతను సాక్షి టాబ్లాయిడ్లు గత ఏడేళ్లుగా నిర్వర్తిస్తున్నాయి. ఇకముందు కూడా నిర్వర్తిస్తాయి. టాబ్లాయిడ్‌లో వచ్చిన కథనాలతో చలికి గడ్డకట్టుకుపోతున్న హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు అందితే.. దశాబ్దాలుగా తాళ్లతో కట్టిన వంతెన మీద రాకపోకలు సాగిస్తున్న గిరిజన గ్రామ ప్రజలకు సంవత్సరంలోపు వంతెన నిర్మాణం జరిగితే.. గ్రామీణ వైద్యశాలల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటే.. టీచర్లు బడికి డుమ్మా కొట్టకుండా వెళితే, అధికారి ఆఫీసులో లేడనే సమాచారం తెలుసుకుని డబ్బు, శ్రమ రెండూ ఆదా అయితే.. ఇంతకన్నా పాఠకునికి ఏం కావాలి!
పరిశోధనాత్మక కథనాలంటే భూకంపం పుట్టించేవి మాత్రమే కాదు.. మీ ఊరిలో, మీ వాడలో, మీ పట్టణంలో జరిగే చిన్న చిన్న అక్రమాలను వెలికితీయడం కూడా అని టాబ్లాయిడ్లు నిరూపించాయి. వలసలు మొదలయ్యాయి... జాగ్రత్త అని పాలకులని హెచ్చరించినవీ టాబ్లాయిడ్లే. కరువు ముంచుకొస్తుంది.. కళ్లు తెరవండి అని చాటింపు వేసింది కూడా ఈ 16 పేజీలే. ఎమ్మెల్యేసార్ ఎక్కడున్నావయ్యా అని ఎలుగెత్తి ప్రశ్నించింది ఈ సింగిల్‌కాలమ్ వార్తలే. ఎప్పుడూ వ్యతిరేక వార్తలేనా... మంచి కూడా ఉంది. మానవత్వం ఉన్న మనుషులున్నారని వారి కథనాలకి అక్షర రూపం ఇచ్చింది కూడా టాబ్లాయిడ్లే.
జనాన్ని జాగృతం చేసిన ‘జనసభ’లన్నా, మహిళలకు అక్షరాలు నేర్పించిన ‘అక్షరసాక్షి’ కైనా, ఏటికి ఎదురీది కూతుళ్లని చదివిస్తున్న మహిళల అలుపెరగని ప్రయాణాన్ని ‘నా కూతురే నా జీవితం’గా మలచినా, రాత్రీ పగలు శ్రమించి అక్షరాలు, ఫొటోల్లో పొందుపరచిన ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’ అయినా, ‘విలేజ్ విజిట్’ లాంటి కొత్త ఆలోచనలకైనా వేదిక సాక్షి టాబ్లాయిడ్లే. పేజీలు ఆకర్షణీయంగా ఉంటేనే సరిపోదు. అందులో సరుకు ఉండాలి. ప్రతీ వార్త, ప్రతీ పేజీ చదివించగలగాలి. వార్తను ఒక కథలాగా అందంగా చెప్పగలిగితే పాఠకుడు ఎక్కడికీ వెళ్ళడు. సాక్షి మొదటినుండి ఈ సిద్ధాంతాన్ని నమ్మింది. ఆచరించింది.
ఉద్యమాలు తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో కూడా సాక్షి నిష్పక్షపాతంగానే ఉంది. అన్ని వర్గాల ప్రజల ఆదరణను పొందింది. పొందుతూనే ఉంది. ఇందులో టాబ్లాయిడ్లది ఉడతాభక్తి. కాగితంతో ఉన్న అనుబంధం మట్టితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. జర్నలిజం మూలాలు గ్రామాల్లో ఉన్నాయని గుర్తుచేస్తాయి ఆ 16 పేజీలు. ఇప్పుడు బాధ్యత మారింది. గ్రామీణ వార్తల్లోంచి ఒకేసారి ఇంటర్నెట్‌లోకి.. కంప్యూటర్ ఓపెన్ చేసేముందు టేబుల్‌మీద ఉన్న జిల్లా టాబ్లాయిడ్‌ని ఒకసారి చేతిలోకి తీసుకుంటేగాని కీబోర్డ్ మీద వేళ్లు కదలవు.
- ఎస్.గోపీనాథ్ రెడ్డి, డిప్యూటీ ఎడిటర్