వలస కూలీస్వయంకృషి   

Migrant laborer..Head of the company - Sakshi

దుబాయిలో ఒకప్పుడు సాధారణ కార్మికుడు

ఇప్పుడు వెయ్యి మంది కార్మికులున్న కంపెనీకి యజమాని

స్వశక్తితో రాణించిన తిమ్మాపూర్‌ వాసి

భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ కార్మికులకు ఉపాధి

మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా) : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన కుంట శివారెడ్డిది సాధారణ రైతు కుటుంబం. పదో తరగతి వరకు చదువుకున్నాడు. పైచదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు నిలిపివేశాడు. తమ కుటుంబానికి ఉన్న ఐదు ఎకరాల భూమిలో తమ ఇంటి వారే పనిచేస్తుండటంతో శివారెడ్డికి మరో పని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2001లో దుబాయికి వెళ్లాడు.

అక్కడ ఒక భవన నిర్మాణ కంపెనీలో కార్మికునిగా చేరిన శివారెడ్డి కొన్ని నెలల పాటు పనిచేశాడు. కార్మికునిగా ఎన్ని రోజులు పనిచేసినా తాను నిర్ణయిం చుకున్న లక్ష్యానికి చేరుకోలేనని భావించి సూపర్‌వైజర్‌గా పదోన్నతి పొందడం కోసం కృషిచేశాడు. సూపర్‌వైజర్‌గా పదోన్నతి పొందాలంటే అరబ్బీ, ఇంగ్లిష్‌ భాషలు రావాలని గుర్తించి రెండు భాషలపై పట్టు సాధించాడు. దుబాయికి వెళ్లిన కొన్ని నెలలకే సూపర్‌వైజర్‌గా పదో న్నతి పొందాడు.

తాను ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే పది మందికి ఉపాధి చూపాలని భావించాడు. సొంతంగా కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. సూపర్‌వైజర్‌గా పనిచేసినంత కాలం కంపెనీ ఏర్పాటు, కార్మికులకు పనిచూపడానికి అవసరమైన మార్గాలను తెలుసుకున్న శివారెడ్డి 2012లో ‘ఏఆర్‌డీ అల్రువిస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌’ కంపెనీ ఏర్పాటు చేసి దుబాయి ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందాడు.

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు కార్మికులను సరఫరా చేస్తూనే విల్లాలు, బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడానికి కాంట్రాక్టులను తీసుకున్నాడు. తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ కార్మికుల సంఖ్యను పెంచుకున్నాడు. తాజాగా దుబాయ్‌లోని ఒక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. విల్లాలను నిర్మించే బాధ్యతను శివారెడ్డి కంపెనీకి అప్పగించింది. ఒక్కో కార్మికునికి నెలకు మన కరెన్సీలో రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వేతనం చెల్లిస్తున్నాడు.

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.15వేల వరకే ఉంది. కానీ, శివారెడ్డి మాత్రం కార్మికుల శ్రమకు తగ్గ వేతనం చెల్లిస్తున్నాడు. తెలంగాణకు చెందిన కార్మికులతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులకు కూడా శివారెడ్డి ఉపాధి కల్పిస్తున్నాడు. కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని సైతం శివారెడ్డి కంపెనీ కల్పిస్తోంది.  

పని కల్పించడమూ సేవనే..

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వచ్చిన కార్మికులకు పని కల్పించడము కూడా సేవనే. కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడం, ఇమిగ్రేషన్‌ సమస్యలను పరిష్కరించడం ప్రధానం కాదు. పని చేయాలనుకునేవారికి పని ఇవ్వడమే ప్రధానం. మా కంపెనీపై నమ్మకంతో ఎంతో మంది కార్మికులు పని కోసం వస్తున్నారు.  కార్మికులకు మా కంపెనీపై నమ్మకం ఉందనే విషయం మాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది.  - కుంట శివారెడ్డి

సొంతూరులో వ్యవసాయం 

శివారెడ్డికి వ్యవసాయంపై ఎంతో మక్కువ. వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ముతో సొంతూర్లో 20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వీలున్న సమయంలో దుబాయి నుంచి తిమ్మాపూర్‌కు వచ్చి వ్యవసాయాన్ని చూసుకుంటున్నాడు. కేవలం అజమాయిషీనే కాకుండా స్వయంగా పొలం పనులు చేస్తుండటం గమనార్హం.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top