
ముంబై: సమాజం మనకు ఏమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేం ఇచ్చాం అని ఆలోచించేవాళ్లు కొందరే ఉంటారు. అందులో నటుడు, నిర్మాత సోనూసూద్ ముందు వరుసలో ఉంటాడు. ఇతరులకు వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి ఎందరో వలస కార్మికులు స్వస్థలాకు చేరేందుకు సాయం చేశాడు. తాజాగా ఆయన కరోనా తెచ్చిన మార్పుల వల్ల పలకరించుకునే పద్ధతులు మారాలంటున్నాడు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ సాంగ్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో షేక్‌హ్యాండ్స్ ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ భారతీయ సాంప్రదాయ పద్ధతిలో నమస్కారం లేదా సలామ్ చేయాలని పిలుపునిచ్చాడు. (ప్లాన్ ఎ.. ప్లాన్ బి.. ప్లాన్ సి!)
అంతే కాకుండా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ చిరునవ్వుతో నమస్కరించాలన్నాడు. మీరు ఒక్కసారి మాత్రమే జీవిస్తారు (YOLO- You Only Live Once) అంటూ ఈ జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. "మీరు సినిమాలో విలన్ కావచ్చేమో కానీ నిజ జీవితంలో మాత్రం హీరో" అంటూ సోనూపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ విపత్కర కాలంలో కష్టాల్లో ఉన్నవారికి సోనూసూద్ ఆపన్నహస్తం అందిస్తుండటం చూసి సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మనీష్ పౌల్ వంటి పలువురు నటీనటులు సైతం తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ( సోనూసూద్ మనసు బంగారం)