ఫ్యామిలీతో... నేను... శైలజ...

ఫ్యామిలీతో... నేను... శైలజ...


చిత్రం: ‘నేను... శైలజ’

తారాగణం:  రామ్, కీర్తీ సురేశ్, సత్యరాజ్

సంగీతం: దేవిశ్రీప్రసాద్

కెమేరా: సమీర్‌రెడ్డి

కళ:  ఏ.ఎస్. ప్రకాష్

ఎడిటింగ్:  శ్రీకర్‌ప్రసాద్

నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్

రచన - దర్శకత్వం: కిశోర్ తిరుమల

 

లైఫ్‌లో చాలా ఈజీ - ప్రేమలో పడడం. కానీ, చాలా కష్టం - ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం!’ ‘నేను... శైలజ’లో హీరో ఓ సందర్భంలో కాస్త అటూ ఇటుగా ఇదే అర్థమొచ్చేలా డైలాగ్ చెబుతాడు. సినిమా కూడా అంతే! ప్రేమకథ చెప్పడం ఈజీ. కానీ, దాన్ని తెరపై అందరికీ నచ్చేలా చెప్పడం చాలా కష్టం. మంచి హిట్ కోసం చూస్తున్న హీరో రామ్, మంచి చిత్రాలను అందించడంలో ముందుండే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సారి అలాంటి ప్రేమకథాచిత్రాన్ని తలకెత్తుకున్నారు.    

 

ఇది ‘హరి’ (రామ్) అనేవాడి ప్రేమ కథ. హరి, అతని సోదరి కీర్తి - ఇద్దరూ కవలలు. ఎవరు పెద్దో, ఎవరు చిన్నో తెలీదు కాబట్టి, ‘అక్కయ్యా’ అని అతను, ‘అన్నయ్యా’ అని ఆమె పిలుచుకొనేంత క్లోజ్. వాళ్ళ అమ్మా నాన్న (నరేశ్, ప్రగతి) పిల్లలను ప్రేమగా పెంచే టైప్. క్లబ్‌లో డీజేగా పనిచేస్తున్న హీరో చిన్నప్పటి నుంచి చాలామందికి ఐ లవ్‌యూ చెప్పి, నో అనిపించుకుం టాడు. చివరకు యాడ్ ఏజన్సీలో పనిచేస్తున్న శైలజ (కీర్తి సురేశ్) అనే అమ్మాయితో కనెక్ట్ అవుతాడు.



చిన్నప్పుడు తాను ఆరాధించి, విడిపోయిన శైలూయే ఈ శైలజ అని గ్రహిస్తాడు. ఆ అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. అతనే చిన్నప్పటి తన ఉంగరం ఫ్రెండ్ అని గుర్తిస్తుంది. తీరా హీరో వాళ్ళ ప్రేమ కథ ఒక కొలిక్కి వచ్చే టైమ్‌కి, ఆ అమ్మాయికి అయిన సంబంధం కుదురుస్తారు అమ్మా నాన్న. ‘ఐ లవ్ యు.. బట్ అయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు’ అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్

 హీరోయిన్ అసలు కథలోకి వెళితే - ఆమె నాన్న శ్రీనివాసరావు (సత్యరాజ్). పిల్లల బంగారు భవిత కోసం కాంట్రాక్టులంటూ దేశాలు పట్టి అతను వెళితే, అమ్మ (రోహిణి) హీరోయిన్‌నీ, ఆమె అన్న (ప్రిన్స్)నీ జాగ్రత్తగా పెంచుతుంది.



దాంతో, పిల్లల పట్ల ప్రేమ ఉన్నా చెప్పని తండ్రికీ, తన మనసులోని భావాల్ని బాహాటంగా వ్యక్తం చేయలేని కూతురిగా హీరోయిన్‌కూ మధ్య అంతరం పెరిగిపోతుంది. మరోపక్క మాట పట్టింపుతో పాతికేళ్ళ క్రితం శ్రీనివాసరావు తన తండ్రికీ, చెల్లికీ దూరమవుతాడు. తీరా చెల్లెలే వచ్చి తన కొడుక్కి (చైతన్య కృష్ణ), హీరోయిన్‌ని ఇచ్చి చేసి, కుటుంబాలు దగ్గరవుదామంటుంది. ఈ ఫ్యామిలీ ట్విస్ట్ వల్లే హీరో యిన్ దూరమైందని గ్రహించిన హీరోకు- హీరోయిన్ అన్న, తన అక్క ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది.



ఇంకేం... పెళ్ళి కానున్న హీరోయిన్ ఇంటికి వెళతాడు. అక్కడ హీరో ఏం చేశాడన్నది మిగతా సినిమా.  

 ఎక్కువగా మాస్ చిత్రాల్లో హుషారుగా కనిపించే రామ్ ఈ హరి పాత్ర కోసం నియంత్రణలోకొచ్చారు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ పవన్ కల్యాణ్ శైలి తొంగి చూసినా, తరువాత కుదురుకున్నారు. హీరోయిన్ కీర్తీ సురేశ్ తెలుగుకు కొత్త. కాబట్టి, చూడగానే గుర్తుపట్టడం కానీ, గుర్తుపెట్టుకొనే నటన ఆశించడం కానీ అత్యాశ. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్‌కు డైలాగులు తక్కువ. ముఖంలోనే చూపాల్సిన హావభావాలెక్కువ. రోహిణి, నరేశ్, ప్రగతి లాంటి అనుభవజ్ఞులు ఎలాగూ ఉన్నారు. బాల తారలతో బాగా నటింపజేశారు.

 

దర్శక, రచయిత తిరుమల కిశోర్ డైలాగుల్లో రచయితగా తన బలాన్ని మరోసారి చూపించారు. కొన్ని డైలాగులు నవ్విస్తాయి. కొన్ని గుర్తుండిపోతాయి. ‘ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటే... సిస్టమ్‌లో సినిమా చూడడం లాంటిది. లవ్ మ్యారేజ్ అంటే థియేటర్‌లో సినిమా చూడడం లాంటిది. సినిమా ఒకటే అయినా, ఫీల్‌లో తేడా ఉంటుంది’ లాంటివి యూత్‌కు నచ్చుతాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ కలిసొచ్చే అంశాలు. దేవిశ్రీ తరహా క్లబ్ గీతం ‘నైట్ ఈజ్ స్టిల్ యంగ్...’ (రచన సాగర్) సరదాగా అనిపిస్తుంది.



‘ఇఫ్ యు గో టు హెల్ యముడేమో థ్రిల్’ లాంటి ఎక్స్‌ప్రెషన్స్ కొత్తనిపిస్తాయి. నేపథ్యసంగీతం కొన్ని సీన్లకు ఉత్తేజమిచ్చి, సెకండాఫ్‌లో ఒక దశ దాటాక పాత రికార్డేదో పదేపదే విన్నట్లుంది. ఫస్టాఫ్ అందమైన ప్రేమ క్షణాలతో, యూత్‌ఫుల్‌గా అనిపిస్తూ, చిరునవ్వులు విరబూయిస్తూ సాగుతుంది. కీలక మలుపు తిరిగిన హీరో హీరోయిన్ల ప్రేమకథకు సెకండాఫ్‌లో కన్‌క్లూజన్ చెప్పే క్రమంలో ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ దాకా సినిమాలు, వాటి ఫీల్ గుర్తుకొస్తాయి. నిజానికిది రెండుంబావు గంటల పైచిలుకు వ్యవధి సినిమానే. కానీ, సెంటిమెంట్ సీన్ల బరువుతో సెకండాఫ్ భారంగా గడుస్తుంది.



అయితే, క్లైమాక్స్‌కు ముందు హీరోతో సత్యరాజ్ మాటలు, సత్యరాజ్‌తో హీరోయిన్ మాట్లాడే మాటలు కీలకం. అలాంటి ఘట్టాలు కొన్ని ఉంటే, సినిమా పట్టు పెరిగేది. ప్రేమలో విఫలమైన రౌడీగా మహర్షి పాత్రను విలన్ ప్రదీప్ రావత్‌తో వేయించడం వెరైటీ. ఒకప్పుడు స్వర్గీయ శ్రీహరికి నప్పే ఈ పాత్రను ఇంకా వాడుకోగలిగితే, కామెడీ కలిసొచ్చేది.

 

ఆల్రెడీ పెళ్ళి కుదిరిన హీరోయిన్. ఆమెను ప్రేమిం చిన హీరో. హీరోయిన్ ఇంటికే హీరో వచ్చి, ఆమె ఇంట్లో వాళ్ళను ఇంప్రెస్ చేసి, తమ ప్రేమని పెళ్ళిపీటలకెక్కించ డం - ఈ బాక్సాఫీస్ ఫార్ములా మనకు కామనే. ‘నేను శైలజ’ కున్న బలమూ, బలహీనత కూడా అదే! అందుకే, ఒక ప్రముఖ సినీ రచయిత ఆ మధ్య ఆంతరంగికంగా అన్నట్లు, మన వరకు ‘దిల్‌వాలే దుల్హనియా’ ఒకసారి కాదు... ‘బార్.. బార్... లే జాయేంగే’! ఈ ఫ్యామిలీ ఫిల్మ్ దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్.

- రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top