మోదీకి యూఏఈ అవార్డు

UAE crown prince confers PM Modi with highest civilian award - Sakshi

మళ్లీ సొంతింటికి వస్తున్నందుకు కృతజ్ఞతలు: యూఏఈ రాజు

కశ్మీర్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్న ప్రధాని

రూపే కార్డు ప్రారంభించిన మోదీ

అనంతరం బహ్రెయిన్‌కు ప్రధాని మోదీ

అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్‌ నహ్యాన్‌ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది.  

కశ్మీర్‌ దేశ చోదకశక్తి
రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్‌ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది.

వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్‌ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్‌ అభివృద్ధికి కశ్మీర్‌ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి.

అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా  తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు .

బహ్రెయిన్‌ చేరుకున్న మోదీ
శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్‌ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్‌ నేషనల్‌ స్పేస్‌ సైన్స్‌ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్‌ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్‌ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్‌జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top