
రాజకీయ నేతలే ఎందుకు అబద్ధాలు ఆడతారు?
ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా రాజకీయ నాయకులే ఎక్కువ అబద్ధాలు ఆడతారు.
న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా రాజకీయ నాయకులే ఎక్కువ అబద్ధాలు ఆడతారు. బహిరంగ సభల్లో , ఎన్నికల ర్యాలీల్లో, ఇంటర్వ్యూల్లో, టీవీ చర్చాగోష్ఠిల్లో మాత్రమే కాకుండా సర్వదా అన్ని పరిస్థితుల్లో అలవోకగా అబద్ధాలు ఆడుతారు. ఈ విషయంలో బెరుకనేది కనిపించకుండా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నట్లుగా అబద్ధాన్ని అతికినట్లు చెప్పడంలో వారికి వారేసాటి. నిజాన్ని చెప్పడంలో పొదుపు, అబద్ధాలను చెప్పడంలో విశృంఖలత పాటిస్తారు. ఎందుకు?
అబద్ధాలు ఆడే రాజకీయ నాయకుల్లో పలు రకాల వాళ్లు ఉంటారు. కొందరు తాత్కాలిక ప్రయోజనం ఆశించి, మరికొందరు దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించి ఆబద్ధాలు ఆడేవారుంటున్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అబద్ధాలాడితే మరికొందరు పార్టీ లేదా ప్రాంతం, లేదా దేశం ప్రయోజనాలు ఆశించి ఆబద్ధం ఆడుతారు. పార్టీ లేదా దేశం పరువు ప్రతిష్టల పరిరక్షణ కోసం అబద్ధాలు ఆడేవారు కొందరైతే అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చేవారు కొందరు ఉంటారు. మరికొందరైతే అబద్ధం ఆడినట్లు ఉండకుండా, నిజాన్ని కొంచెం అటు, ఇటుగా మార్చి చెబుతారు. కొందరు ఊహాత్మక అబద్ధాలు ఆడుతారు. ఏది ఏమైనా తాము మాట్లాడింది అబద్ధమని తేలినప్పుడు తేలిగ్గా తీసుకునేవారు ఉంటారు, తన మాటలను వక్రీకరించారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించేవారు మరికొందరు.
ఇవి కూడా అబద్ధాలే....
తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాలకు క్షమాపణలు చెప్పేవారంటున్నారు, అప్పుడున్న పరిస్థితుల్లో తాను అలా అనుకున్నానని నెపాన్ని పరిస్థితులపైకి నెట్టే వారుంటారు. ఏదేమైనా రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. ఐఎస్‌ఐఎస్ వ్యవస్థాపకుడు ఒబామా అంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం, భారత సైన్యంలోని తూర్పు కమాండ్ ఎప్పుడూ నిర్వహించే సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటే దేశంలో సైనిక కుట్ర జరుగుతోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వక్తం చేయడం, నరేంద్ర మోదీ తనను చంపేందుకు కుట్రపన్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించడం, ఆర్థిక ఆంక్షలున్న ఇరాక్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటించడం లాంటివి కూడా అబద్ధాలే.
మిసా భారతి అబద్ధం...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి మాట్లాడుతూ గెస్ట్ లెక్చర్ ఇవ్వడం కోసం తనను హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించిందని ప్రకటించారు. ఆ విషయాన్ని హార్వర్డ్ యూనివర్శిటీ అధికారికంగా ఖండించింది. ఆప్ కేబినెట్ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తనకు లా డిగ్రీ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆయన లా చదవలేదని తెలియడంతో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి వ్యక్తిగత ప్రతిష్టను ఇనుపడింప చేసుకునేందుకు ఆడే అబద్ధాలు. ఇలాంటి అబద్ధాల వల్ల కొన్ని సార్లు కెరీర్ నష్టపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్షమాపణలతో బయటపడవచ్చు. కేసు విచారణ నుంచి బయటపడేందుకు నాడు బిల్ క్లింటన్, తనకు మోనికా లెవిన్స్కీతో ఉన్న సంబంధాన్ని ఒప్పుకొని అందుకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.
పలు కారణాలతో అబద్ధాలు...
ద్వంద్వ ప్రమాణాలతో, ఆత్మవంచనతోనూ, మోసంచేసే ఉద్దేశంతో, వాస్తవాలను దాచాలనే ఉద్దేశంతోనే సాధారణంగా అబద్ధాలు ఆడుతుంటారు. దేశ ప్రతిష్టను రక్షించేందకు కొందరు అబద్ధాలు ఆడుతుంటారు. 1953 నుంచి 1961 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన డ్వైట్ డీ హైసనొవర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ అమెరికా నిఘా విమానాన్ని అప్పటి సోవియట్ యూనియన్ కూల్చడం అబద్ధమనడం అలాంటి అబద్ధమే.
కొందర అధికారంలోకి రావడానికి వాస్తవాస్తవాలను పట్టించుకోకుండా ఉద్వేగంతో అబద్ధాలు ఆడుతారు. ఆ కోవకు చెందిన వ్యక్తిగా డోనాల్డ్ ట్రంప్‌ను పేర్కొనవచ్చు. విదేశాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయని, అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయని, వేతనాలు పడిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని ఎన్నికల సందర్భంగా ఆయన పదే పదే మాట్లాడారు. అయితే ఆయన మాటలన్నీ అబద్ధాలన్నీ తేలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవడమే కాకుండా గడచిన తొమ్మిదేళ్లకన్నా నిరుద్యోగ సమస్య ఈసారి తగ్గింది.
అబద్ధాలతోనే పెరుగుతున్నాం...
మనం చిన్నప్పటి నుంచి అబద్ధాలతో పెరుగుతాం. పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తే తల్లి అబద్ధాలతో భయపడుతూ, బుజ్జగిస్తూ తినిపిస్తుంది. అలాంటి అబద్ధాలను శ్వేత అబద్ధాలు అంటాం. వాటిల్లో కల్లాకపటం ఉండదు. నిజజీవితంలో నిజంగా ఆడే అబద్ధాలతోనే ప్రమాదం. మనం అబద్ధాలు ఆడినప్పుడు ఇది తప్పంటూ మనల్ని గిల్లీ హెచ్చరించే వ్యవస్థ మన మెదడులో ఉంటుందని, పదే పదే అబద్ధాలు ఆడుతుంటే అలా హెచ్చరించే వ్యవస్థ స్పందన కోల్పోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి స్పందన కోల్పోవడం వల్లనే రాజకీయ నాయకులు అలవోకగా అబద్ధాలు ఆడేస్తారట.