
కేసీఆర్ డిసైడైతే..
ప్రజలు, రాష్ట్ర మేలు కోసం సీఎం కె.చంద్రశేఖర్‌రావు తపిస్తారని..గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు.
► అంతా అభివృద్ధి పథమేనంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు
► ఏది అనుకున్నా వెనక్కి తగ్గకుండా పూర్తి చేస్తారు
► రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోంది
► దేశంలోనే తొలి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం
► గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
కేసీఆర్, మంత్రులు, అధికారులు
► ప్రగతి భవన్‌లోనూ న్యూఇయర్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజలు, రాష్ట్ర మేలు కోసం సీఎం కె.చంద్రశేఖర్‌రావు తపిస్తారని.. ఇలా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విస్తృతంగా సలహాలు, సూచనలు స్వీకరించే సీఎంను తాను ఇప్పటివరకు చూడలేదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ‘‘అన్నింటికీ మించి ఒక్కసారి తను మైండ్‌లో అనుకుంటే.. వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేస్తారు. గత 31 నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను అందించింది. సీఎంతో పాటు మంత్రివర్గ సహచరులందరూ సమర్థంగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది..’’అని పేర్కొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆదివారం సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలన్నీ విజయవంతం కావాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని, 2017లో కేసీఆర్ నేతృత్వంలో ఆ లక్ష్యాన్ని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పనితీరు బాగుంది..
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాలను, ప్రాధాన్యతలను పూర్తిస్థాయిలో నిర్వచించుకోవడంతో పాటు ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అభినందించారు. మిషన్ కాకతీయ, ఇతర నీటి పారుదల పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు త్వరలోనే ఫలాలందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి సహకరించడంతో రాష్ట్రంలో పంటలకు సరిపోయే నీళ్లు అందుబాటులో ఉంటాయని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే అంధకారం నెలకొంటుందనే వాదనను సీఎం కేసీఆర్ తిప్పి కొట్టారని.. అందరినీ ఆశ్చర్యపరిచేలా విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణలో శాంతి భద్రతలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని.. నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలంగాణ పోలీసులను అభినందించారు.
కేటీఆర్‌కు గవర్నర్ అభినందన
ఐటీ రంగంలో తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారంటూ మంత్రి కె.తారకరామారావును గవర్నర్ అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ «సంపన్నులు, మేధావి వర్గాలకు మాత్రమే పరిమితమనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొట్టిందని.. కొత్త పాలసీలతో సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని వ్యాఖ్యానించారు. టీ–హబ్ ప్రపంచ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. అమెరికా సహా దేశ విదేశాల్లో దీనిపై చర్చ జరుగుతోందని, ఈ ఏడాది చివరికల్లా టీ–హబ్ ప్రపంచవ్యాప్తమవుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన గవర్నర్... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలిపారు.
ప్రగతి భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ప్రముఖులు, సాధారణ ప్రజలతో ఆదివారం ఉదయం నుంచి సందడి నెలకొంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యుడు సి.విఠల్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం, పలువురు ఉన్నతాధికారులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సినీ ప్రముఖులు, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా సీఎంను కలిశారు.