విశిష్టం నోముల సాహితీ వ్యక్తిత్వం

Guest Column On Poet Nomula Satyanarayana - Sakshi

డాక్టర్‌ నోముల సత్యనారాయణ నల్లగొండ సాహి త్యానికి మాత్రమే కాదు... తెలంగాణ సాహిత్యానికి పెద్ద దిక్కు. ఆయన మరణంతో తెలంగాణ సాహి తీలోకం ఒక తరాన్ని కోల్పోయినట్టయిందని ప్రముఖ సినీ దర్శకుడు బి. నరసింగరావు అన్న మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవం. పెద్దాయన సామల సదాశివ తరహాలోనే నోముల తెలుగు సాహి త్యానికే మార్గదర్శకుడు. అతి సామాన్య కుటుం బంలో జన్మించి ఎంతో ఇష్టంతో అధ్యాపక వృత్తిని స్వీకరించి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగంలో చేరి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. సన్నిహితులందరికీ ఆయన జయహో సార్‌గా ప్రసి ద్ధులు. అధ్యాపక వృత్తితోపాటు సాహిత్య అధ్య యనం నోములను విశిష్ట వ్యక్తిగా నిలిపింది. యువకు నిగా సాహిత్య అధ్యయనం ప్రారంభించి అభ్యుదయ భావాలవైపు ఆకర్షితుడై, ఆ అధ్యయనంలో నేర్చుకున్న విలువలనే జీవితంలోనూ ఆయన పాటించారు. ‘ఎంఏ అర్హత సంపాదించడం కాదు.. మనిషి ‘ఎంఏఎన్‌’ కావాలి, అప్పుడే చదివిన చదువుకు సార్థకత’ అని చెప్పేవాడు. తానూ అలాగే జీవించాడు. 

స్వయంకృషితో ఆయన బహు భాషలను నేర్చు కున్నాడు. నేర్చుకోవడమేకాదు.. వాటిపై పట్టు సాధిం చాడు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో సాహిత్య అధ్యయనం చేశారు. ఆయనకు సంగీతంలోనూ మంచి అవగాహన ఉంది. నోముల రాయడంకోసం కాకుండా, చదవడం కోసం పుట్టాడు. యువ రచయితలనూ, కవులనూ ప్రోత్సహించాడు. తొలినాళ్లలో పద్య కవిత్వం రాసినా అది ఆయనకు సంతృప్తి నివ్వలేదు. అప్పటికే సాహితీ శిఖరాలుగా ఉన్న శ్రీశ్రీ, రావిశాస్త్రి తదితరుల రచనలు చదివి ఉన్నాడు గనుక తన రచనలు తనకు తృప్తినివ్వలేదు. కాబట్టే రాయడంపై ఆసక్తి సన్నగిల్లింది. ప్రయోజ నకర రచనలను సాహితీ అభిమానులకు పరిచయం చేయడానికే ఇష్టపడ్డారు. సాహితీ విమర్శపై దృష్టి పెట్టారు. ప్రసిద్ధ భారతీయ రచనలను విమర్శనాత్మ కంగా పరిచయం చేశారు. వాటిని ‘సామ్యవాద వాస్త వికత’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. 

ఆయన చేసిన అనువాదాలెన్నో. ప్రసిద్ధ చైనా రచయిత టావ్‌ చెంగ్‌ రచనను ‘నా కుటుంబం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. అది ఆయనకు తెలుగు పాఠకుల్లో గొప్ప గుర్తింపు తెచ్చింది. నోముల సాహితీ కృషిలో గుర్తించదగింది ‘మరో కొత్త వంతెన’. ఉర్దూ, తెలుగు ద్విభాషా కవిత్వ సంకల నంగా వెలువడిన ఆ గ్రంథంలో చాలా పద్యాలు ఆయన ఉర్దూనుంచి తెలుగులోకి అనువదించినవే. ఉర్దూ నుంచి తెలుగులోకి, తెలుగునుంచి ఉర్దూలోకి అనువదించడంలో డాక్టర్‌ నోముల సామర్థ్యం ఎంత టిదో ఆ గ్రంథమే చెబుతుంది.

సాహిత్య సభలు, సాహితీ బంధువులే లోకంగా నోముల గడిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఇల్లు సాహితీ కేంద్రంగా భాసిల్లింది. రావిశాస్త్రి, శ్రీశ్రీ, అద్దేపల్లి రామ్మోహన్‌ రావు వంటి అనేకమంది ప్రముఖులతో ఆయన సాహితీ సమావేశాలు నిర్వహించేవాడు. కొత్త తరానికి మూల నిర్దేశం చేసిండు. డాక్టర్‌ నోముల మీది అభిమానంతో ఆయన శిష్యులు కొంపెల్ల వెంకట్, కృష్ణమోహన్‌ శర్మ ’డాక్టర్‌ నోముల అన్‌హోల్డ్‌ లెసన్స్‌’ ప్రకటించారు. నోములతో మాట్లాడుతూ రికార్డు చేసిన పుస్తకం అది. నోముల మౌఖిక రచన. ఇది తెలుగు సాహిత్యంలో విశిష్టమైన పుస్తకంగా గుర్తింపు పొందింది. మరో సాహితీ మిత్రుడు డాక్టర్‌ పెన్నా శివరామకృష్ణ కూడా ‘నోముల సాహితీ ముచ్చట్లు’ను రికార్డు చేసిండు. కానీ, అది వెలువడటంలో ఆలస్యం జరిగింది.

నోముల సాహిత్య వాసనలు ఆయన కుటుంబ సభ్యులకూ అబ్బినాయి. నోముల మీద గౌరవంతో ఆయన కుటుంబ సభ్యులు ‘నోముల సాహిత్య సమితి’ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తెలుగు కథల పోటీలను నిర్వహించి ప్రతి సంవత్సరం ‘నోముల కథా పురస్కారాలు’ అందించినారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి బహుమతి పొందిన కథలతో ‘నోముల పురస్కార కథలు’ వెలువరించినారు. ఈ సంస్థ ద్వారానే తెలంగాణ సాహిత్యం గర్విం చదగిన పుస్తకాలను వెలువరించినారు. నల్లగొండ కథలు, చాకలి ఐలమ్మ, తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు వంటి పుస్తకాలు వెలువరించినారు. సాహిత్యమే ఊపిరిగా బతికిన డా‘‘ నోముల సత్యనారాయణ తన 78వ ఏట లోకాన్ని వీడినారు. రాగద్వేషాలు, అసూయ వంటి పదాలు తెలియని నోముల ప్రేమను మాత్రమే అందించి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఒక నడిచే గ్రంథాలయం ఆగి పోయింది. ఒక శిఖరం ఒరిగి పోయింది. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఇది ఆక్షర సత్యం.

వ్యాసకర్త: ఎలికట్టె శంకరరావు, 85230 56256
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top