గత వైభవం ఇక గగనమేనా!

BJP Will Not Get That Much Majority As 2014 Says Shekhar Gupta - Sakshi

జాతిహితం 

తాను ఎన్నికలలో విజయం సాధించలేనని 1989 వరకు బీజేపీ విశ్వసించింది. అందుకు కారణం హిందూ సమాజంలోని కులవిభజనలు. ఈ వాస్తవాన్ని మొదట గుర్తించినవారు ఎల్‌కె అద్వాణీ. అందుకే మతాన్ని ఉపయోగించుకుని ఆ వర్గాలను ఏకం చేయాలని ఆయన ఒక పథకం (అయోధ్య ద్వారా) ప్రారంభించారు. ఇది చాలా విస్తృతంగా పనిచేసింది. కానీ దీని ప్రభావం ఎక్కువ కాలం లేదు. యూపీలో ఒకప్పుడు బీజేపీదే ఆధిక్యం. కానీ ములాయం/అఖిలేశ్, మాయావతి 8 పర్యాయాలు ముఖ్యమంత్రులయ్యారు.

భారతదేశ ఓటర్లలో ముస్లింలు కేవలం 15 శాతం ఉన్నారు. వీరంతా ఏనాడూ బీజేపీకి ఓటు వేయలేదన్న మాట నిర్వివాదాంశమైనది. 1989 తరువాత కాంగ్రెస్‌ తన కీలక ఓటు బ్యాంకులను జార విడుచుకున్న అనంతరం కూడా ముస్లింలు బలమైన ఓబీసీ వర్గం యాదవులతోనే కలిశారు. ఇక మాయావతి వెనుక ఉండే దళితులు అప్పుడప్పుడు బీజేపీని దూరంగా ఉంచడమే కనిపిస్తుంది. ఇలాంటి లెక్కలను చూస్తూ నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు భారతదేశాన్ని ఎవరు పాలించాలో ముస్లింలు తమ వీటో అధికారం ద్వారా శాసిస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. 

కానీ ఈ పరిస్థితిని 2014లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మార్చివేశారు. లౌకికవాదం ముసుగులోని అన్ని ప్రతీకలని, నిజం చెప్పాలంటే అలాంటి కపటత్వపు ప్రతీకలని మోదీ చెత్తబుట్టలోకి విసిరేశారు. ముస్లింలు మాకు వేటు వేయకూడదని భీష్మించుకుంటే అలాగే, మాకు పడే ఓట్లు చాలినన్ని మరొక చోట ఉన్నాయి, దీనిని వారు గుర్తించేటట్టు చేయండి అన్నదే మోదీ వాదన. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టంగానే ఉన్నారు. మైనారిటీలకు ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. అందరిలాగే వారూ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌లో అంతర్భాగమే. 

ముస్లింలు మోదీకి ఓటు వేయలేదు. అయినప్పటికీ ఆయన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకుండా 282 స్థానాలు గెలిచారాయన. రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో కూడా ఇదే పునరావృతమైంది. ఉత్తరప్రదేశ్‌లో 19 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు. అయినా కూడా 77 శాతం అసెంబ్లీ స్థానాలను ఆయన కైవసం చేసుకున్నారు. తమకు ఉన్న వీటో అధికారంతో ముస్లింలు దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయిస్తారన్న అదృశ్య భూతారాధనను మోదీయే పటాపంచలు చేసేశారు. పైగా ఏవో కొన్ని ముస్లిం పేర్లను నామమాత్రంగా చేర్చడం ద్వారా వారు ఈ విమర్శకు స్పందించలేదు. స్నేహపూర్వకంగా ఉండే ముస్లిం మేధావి వర్గాన్ని తయారుచేసుకోవడం గురించి కూడా పట్టించుకోలేదు. అంటే – మీరు మాకు ఓటు వేయకపోతే, మీతో మేం అధికారం పంచుకుంటామని ఆశించవద్దు అనే.

ఇంతవరకు బీజేపీతో జాగ్రత్తగా ఉన్న వివిధ హిందూ సామాజిక వర్గాలకు మోదీ చేసిన విన్నపంతో ఇది సాధ్యమైంది. యాదవేతర ఓబీసీ ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్లడం ఒక వాస్తవం. అంతేకాదు, 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలకు గాను మాయావతి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. 2017 శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీ 19 స్థానాలకు పరిమితమైంది. అంటే పెద్ద సంఖ్యలో దళిత ఓట్లు కూడా బీజేపీకి దక్కాయని తార్కికంగా ఒక ముగింపునకు రావచ్చు. బీజేపీ గెలుచుకున్న 282 లోక్‌సభ స్థానాలలో దళితులు గెలిచినవి నలభై ఉన్నాయి. అవి వారికి కేటాయించిన నియోజకవర్గాలు. మరో ఆరుగురు దళితులు కూడా ఉన్నారు. వీరు ఎన్డీయే భాగస్వాములు ఎల్‌జేపీ, టీడీపీలకు చెందినవారు. ఆ 15 శాతం ఓట్లతో ప్రమేయం లేకపోయినా బీజేపీ సునాయాసంగా విజయం సాధించడానికి కారణం ఇదే. 

అయితే దేశవ్యాప్తంగా దళితులలో పెరుగుతున్న ఆగ్రహం, వారు చెబుతున్న మాటలు గడచిన రెండు మాసాల నుంచి కొన్ని కొత్త ప్రశ్నలను సంధిస్తున్నాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలు రోహిత్‌ వేముల, ఉనాల కారణంగా కొద్దికాలం క్రితమే తెర మీదకు వచ్చాయి. 2014 పరిణామం తరువాత ముస్లింలు కాక మిగిలిన 85 శాతం ఓటర్లు అనుసరిస్తున్న విధానం ఊహకు అందనట్టుగానే ఉంది. విద్యార్థుల నుంచి, కిందిస్థాయి రాజకీయం నుంచి యువ దళిత నాయకులు రావడం, భీమా–కొరెగావ్‌ ఉదంతం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ అరాచకాల నిరోధక చట్టం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన నిరసనలు ఇందుకు కారణం. దళితులలో ఆగకుండా పెల్లుబుకుతున్న ఆగ్రహం ఆ 85 శాతం కాస్తా 70 శాతానికి కుదించుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దళిత ఎంపీలు బహిరంగంగా చేసిన ఫిర్యాదు ఇచ్చే సందేశం ఇదే. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు సంజయ్‌ కుమార్‌ డెక్కన్‌ క్రానికల్‌కు ఒక వ్యాసం (ఆగస్ట్‌ 31, 2016) రాశారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రానికి (సీఎస్‌డీఎస్‌) చెందిన కుమార్, 2014 ఎన్నికలలో బీజేపీకి అంతకు ముందు ఎప్పుడూ దక్కనన్ని దళిత ఓట్లు దక్కిన సంగతిని ధువీకరించారు.

గడచిన కొన్ని లోక్‌సభ ఎన్నికల వరకు కూడా 12–14 శాతం దళితులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారని ఆయన రాశారు. అయితే 2014లో ఈ సంఖ్య రెట్టింపయిందని (24 శాతం), కాంగ్రెస్‌ (19 శాతం), బీఎస్సీ (14 శాతం)ల కంటే బీజేపీయే ఎక్కువ దళిత ఓట్లను కైవసం చేసుకుందని ఆయన నిర్ధారించారు. ఇటీవల దళితులలో కనిపిస్తున్న అసహనం ఈ విజయానికి బెడదగా తయారైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీల మధ్య కుదిరిన సయోధ్య ఈ బెడదను మరింత తీవ్రం చేస్తున్నది. ఈ రెండు పార్టీల కలయిక ఎంత శక్తిమంతమైనదో గోరఖ్‌పూర్, ఫూల్పుర్‌ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. మరొక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఆ ఉప ఎన్నికలలో బీఎస్పీ పోటీ చేయలేదు. పూర్వం వలెనే తన ఓట్లను ఎస్పీకి బదలీ చేయగలిగింది. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ ముగ్గురు ఎంపీలు బాహాటంగా చేసిన ఫిర్యాదులో ఆ కొత్త అభద్రత ప్రతిఫలిస్తున్నది. రోహిత్‌ వేముల, భీమా–కొరేగావ్‌ ఉదంతాల తరువాత పరిణామాలతో వెల్లడైన ఇలాంటి అభద్రతలకు తోడు ఇప్పుడు కొత్తవి తోడవుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది– గ్వాలియర్‌లో నిరసన తెలుపుతున్న దళితుల మీద అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడడం. అయితే ఒకటి వాస్తవం– ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో కేంద్రం నిర్వహించే పాత్ర ఏమీ ఉండదు. కాబట్టి ఈ జాతీయ స్థాయి దళిత నిరసన ఏం చెబుతున్నదంటే ఇదంతా అణచుకున్న ఆగ్రహం కట్టలు తెగిన ఫలితం. 2019 దగ్గరవుతున్న ప్రస్తుత సందర్భంలో దీనిని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. మోదీ మాంత్రిక విద్య కూడా దీనిని పరిగణనలోనికి తీసుకుంటుంది. 2014 ఎన్నికలలో తమకు దక్కిన 24 శాతం ఓట్లను వారు వదులుకోలేరు. ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 31 శాతం. దళితులలో నాలుగో వంతు మళ్లీ ఓటు చేయకపోతే ఆ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యం. రిజర్వేషన్ల గురించి ప్రధాని అంత గట్టిగా మాట్టాడుతున్నా, ఒడిశాలో అమిత్‌ షా దళితుల ఇంట్లో భోజనం చేయడం గురించి అంత ప్రచారం కల్పించినా కారణం ఇదే. 

అయితే ఇటీవల దళితుల ఆగ్రహం, చెబుతున్న మాటలు గతంలో మాదిరి కంటే భిన్నమైనవి. చాలామంది పాఠశాలలకీ, కళాశాలలకీ వెళ్లడం, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ఈ తరం మరింత జాగరూకత కలిగిన తరంగా తయారైంది. వారి ఆకాంక్షలు భౌతికపరమైన రక్షణ, ఆహారం, నివాసం, సంప్రదాయికమైన వృత్తుల రక్షణకే పరిమితం కావడం లేదు. ఇలాంటి ఎరలను ఛేదించాలని కొత్త తరం దళితులు అనుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌ మిగిలిన రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకోవడానికి వారికి ఆస్కారం కల్పిస్తున్నాయి. మొదటిసారి ఎంఎల్‌ఏగా ఎంపికైన జిగ్నేశ్‌ మేవానీ వంటి యువనేత ఉత్తర, మధ్య, పశ్చిమ భారతాలలో ఎక్కడికి వెళ్లినా, అంటే దాదాపు భారతదేశంలో ఎక్కడైనా జనాన్ని ఆకర్షించగలుగుతున్నారు. దళితులలో వచ్చిన ఈ ఎదుగుదల గతం కంటే సిద్ధాంతపరమైనది. వీరి భావం, భాష ప్రధానంగా వామపక్షాలవి. కాబట్టి అవి కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమే. 

తాను ఎన్నికలలో విజయం సాధించలేనని 1989 వరకు బీజేపీ విశ్వసించింది. అందుకు కారణం హిందూ సమాజంలోని కులవిభజనలు. ఈ వాస్తవాన్ని మొదట గుర్తించినవారు ఎల్‌కె అద్వాణీ. అందుకే మతాన్ని ఉపయోగించుకుని ఆ వర్గాలను ఏకం చేయాలని ఆయన ఒక పథకం (అయోధ్య ద్వారా) ప్రారంభించారు. ఇది చాలా విస్తృతంగా పనిచేసింది. కానీ దీని ప్రభావం ఎక్కువ కాలం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు బీజేపీదే ఆధిక్యం. కానీ ములాయం/అఖిలేశ్, మాయావతి ఎనిమిది పర్యాయాలు ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టారు. అందులో మాయావతి, అఖిలేశ్‌ రెండు పర్యాయాలు పూర్తికాలం ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అయితే ఒకటి. పాతి కేళ్ల క్రితం నాటి అద్వాణీ నాయకత్వం కంటే 2014లో వచ్చిన మోదీ–అమిత్‌షా కూడిక చాలా శక్తిమంతమైనది. వారు పునరాలోచనకు అతీతమైన జాతీయవాదాన్ని తెచ్చిపెట్టారు. దీనికి మోదీ ఆకర్షణ శక్తి, అచ్చేదిన్‌ నినాదాలు తోడయ్యాయి. గుజరాత్‌లో మోదీ సాధించిన రికార్డులతో వీటిని ప్రజలు విశ్వసించారు. కుల విభజనలను ఇది పక్కకు పెట్టింది.

బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ విభజనల పార్టీలు కకావికలయ్యాయి. ఇంతటి విజయం సాధ్యం కావాలంటే, తాము ఊహించని వర్గాల నుంచి, దళితుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓట్లు రావాలి. ఈ రెండో అంశమే ఇప్పుడు ప్రమాదంలో పడింది. కులం ఒకసారి పై చేయి, ఒకసారి దిగువస్థాయిగా ఉండడం, ఉద్యోగాలు లేకపోవడం, ఉత్తరప్రదేశ్‌లో అగ్రకుల ముఖ్యమంత్రి రావడం వంటి పరిణామాలు మళ్లీ కులాన్ని సమీకరణలో భాగమయ్యేటట్టు చేశాయి. దీనిని బీజేపీ త్వరగానే గుర్తించింది. ఆ విషయాన్ని మోదీ, షా చెబుతున్నారు కూడా. కానీ వారికి మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి– వారికి అందిరినీ ఒప్పించగలిగే, బలమైన దళిత గళం ఏదీ లేదు. రెండు– గతంలో ఆ పార్టీ నరేంద్ర మోదీ, శివరాజ్‌ చౌహాన్‌ వంటి ఓబీసీ ప్రచార సారథులను ముందుకు తెచ్చింది. కానీ 2014 దశ తరువాత అగ్రకులాల ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఈ పరిణామం కని పించింది. మూడు– ఈ ధోరణులను విడనాడడంలో వారు చాలా ఆలస్యం చేశారు. పార్టీ, ప్రభుత్వ నిఘా వర్గాలు దళితుల నిరాశ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వడంలో విఫలమైనాయి. ఏమైతేనేం ఇప్పుడు పార్టీ దీని గురించి చర్చిస్తున్నది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి జరిగిన ఈ నష్టాన్ని ఏ మేరకు నివారించుకోగలరో వేచి చూడవలసిందే.

శేఖర్‌ గుప్తా, వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌, twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top