నువ్వు డాక్టర్‌  అయితే...

Funday Special Story By A Person From Nellore - Sakshi

ఇది మీ పేజీ

ఆరోజు మా చెల్లిని తీసుకొని పెద్ద హాస్పిటల్‌కి పోయినా. ఆ పిల్లకి రెండు రోజుల నుంచి ఒకటే జరం. ఎంత జూసినా తగ్గలేదు. మా నాయనా అమ్మేమో ఇద్దరూ పనికి పోయిండ్రు. మా చెల్లికి నాలుగు ఏండ్లు ఉంటాయి. మా తమ్ముడ్ని ఇంటి కాడే ఇడిసిపెట్టి వచ్చినా. వాడు వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడానికి పోయుంటడు.నేను బడికి పోవడం మానేయడంతో వాడు గూడా ఈ మధ్య బడికి పోవడంలా. వాడు రెండో తరగతి చదువుతుండు. నాకు ఇంకో చెల్లిగూడా ఉంది. దానికి రెండేళ్లు ఉంటయి. దాన్ని మాఅత్తోళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన. మా అత్త కూతురు సుమతికి దాన్ని జూసుకోమని చెప్పిన. మా చిన్న చెల్లి ఎప్పుడు ఏడస్తనే ఉంటది.

నేను పెద్ద హాస్పిటల్‌కి నడుస్తూ వస్తా ఉండ. మా చెల్లిని తీసుకొని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ దగ్గరికి వొచ్చేసరికి నా ముందు ఒక బస్సు వచ్చి ఆగింది. దాంట్లో నుంచి తెల్లకోటు ఏసుకుని డాక్టర్‌ కోర్సు చదివే వోళ్ళు దిగిండ్రు. ఒక్క నిమిషం ఆడ నిలబడి వారిని అట్టే చూస్తా ఉన్నా....నా ప్రాణం చివుక్కుమన్నది.నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ అవ్వాలని కోరిక. మా ఊళ్లో స్కూల్లో చదివేటప్పుడు మా సారు ‘పెద్దయ్యాక ఏమవుతారు?’ అని అందరిని అడిగితే నేను ఎప్పుడు ‘డాక్టర్‌ అవుతా’ అని చెప్పేవోడిని. అందుకే ఈడ వీళ్లను చూస్తానే నాకు బాధేసింది. గతమంతా ఒక్కసారి కళ్లముందు మెదలసాగింది. 

నేను నాలుగో తరగతి వరకు మా ఊర్లోనే చదివిన. అప్పుడు మా నాయనోళ్ళు పొలం పనులకు పోయేవోళ్ళు. మా ఊర్లో బడి అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఉన్న స్నేహితులన్నా చాలా ఇష్టం. నాలుగేళ్ల నుంచి ఊర్లో వర్షాలే బడలేదు. ఊళ్లో పనులేమీ లేవు. అప్పటికి మా చిన్న చెల్లి ఇంకా పుట్టలా. ఈ తిండి లేని పరిస్థితి వస్తదని ముందే తెలుసుకొని మా మామోళ్లు ముందే పట్నం వచ్చేసిండ్రు. ఆ తర్వాత కొద్ది రోజులకు మేం గూడా పట్నం వచ్చినం. మా ఊరిలో మాకు ఇల్లు ఉండేది. ఈడకి వచ్చినాక ఒక చిన్న గుడిసె ఏసుకున్నాము. ఎవరో అధికారులు వచ్చి ఇక్కడ ఇల్లు ఉండకూడదని కూల్చేసినారు. ఆ తర్వాత మేము వేరే చోటకుబోయి ఇల్లుకట్టుకున్నం.

మా ఇంటి ముందే పెద్ద మురికి కాలువ ఉంది. రాత్రిపూట దోమలు భయంకరంగా కుడతాయి. ఒక దోమతెర ఉంటే బాగుండు అనిపిచ్చేది. మా ఇల్లే దోమతెరంతుంటది. ఇంకా అక్కడ దోమతెర ఎక్కడ కట్టేది!  ఆ దోమలు కుట్టే మా చెల్లికి జరం వచ్చింది. ఈడకి వచ్చినాక మా రెండో చెల్లి పుట్టింది. మాయమ్మ, నాయన ఇద్దరూ పనికి పోతే గానీ ఇల్లు గడవదు. మా ఇంట్లో నలుగురు పిల్లలని తెలుసుకున్న మా సరస్వతి టీచర్‌ మాయమ్మని పిలిచి పిల్లలు పుట్టకుండ ఆపరేషన్‌ చేపిచ్చుకోమని కౌన్సెలింగ్‌ ఇచ్చింది. అప్పుడుగాని మా నాయన మాయమ్మకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించలా. 

మా ఇద్దరు చెల్లెళ్ళు చిన్నోళ్ళు. మాయమ్మ నాయనలకి వాళ్లని చూసుకునే సమయం లేదు. మాయమ్మ నాయనా ఉదయాన్నే పనికి బోయి సాయంత్రం వస్తరు.
ఆదివారం ఉదయాన్నే రైతు బజార్‌ దగ్గరకి మా నాయనలాగా పని గావాలి అనుకునేటోళ్ళు ఒక వందమంది దాకా వస్తరు. అక్కడికి కూలీకి పనోళ్ళు గావాలనుకునే మేస్త్రీలు కూడా వస్తరు. అక్కడే పనోళ్ళను మాట్లాడుకుంటరు. పనికి ఒప్పుకున్నోళ్లు వారమంతా ఆ మేస్త్రీ దగ్గరే పని జేస్తరు.

ఇంట్లో మా చెల్లెళ్లను మా తమ్ముడిని నేనే జూసుకోవాల. మా చెల్లెళ్ళకి స్నానం చేయించడం, బట్టలు వేయడం,అన్నం ఒండి పెట్టడంలాంటి పనులు జేసేవోడ్ని. అందుకే వాళ్లను చూసుకునే దానికి బడిమానేసిన.నేను అక్కడే నిలబడి ఆ డాక్టర్‌ చదివే వాళ్ళని చూస్తా ఉండటంతో మా చెల్లి నాతో ‘ఏందన్న ఆగిపోయినవ్‌’ అంది.

‘ఏం లేదు చిన్ని, పెద్దయినాక డాక్టర్‌ అవుదామనుకున్న. ఇదిగో తెల్ల కోటేసుకున్నారు జూడు వీళ్లందరు డాక్టర్‌ చదివేవోళ్ళు. నేనేమో బడికి పోక పోతిని. ఇంకెక్కడ డాక్టర్నవుతా?’ అన్నాను.
మా చెల్లి నాతో ‘అన్నా రేపటి నుంచి నువ్వు బడికి పోయి బాగా చదివి డాక్టరవ్వు’ అన్నది. 

నేను ‘నిజంగా వెళ్ళమంటావా చిన్ని!’ అని అడిగిన.మా చెల్లి నాతో ‘నిజంగా వెళ్లన్నా. నువ్వు డాక్టర్‌ అయితే మనం ఇంత దూరం నడిచి రాబళ్ళేదు. నువ్వే నా జరం తగ్గిచ్చేయొచ్చు’ అంది. దాని మాటలు ఇని నాకు ఆశ్చర్యం ఏసింది. దాని చిట్టి మెదడు కూడా ఆలోచించడం మొదలు పెట్టిందనుకున్న.
‘మరి బుజ్జిని ఎవరు జూసుకుంటరు’ అని అడిగిన.

మా చెల్లి ఠక్కున తడుముకోకుండా ‘నేను చూసుకుంటా’ అన్నది. నాకు దాన్ని జూసి ముచ్చటేసింది.నేను ఎలాగైనా మళ్ళీ బడికి పోవాలని నిశ్చయించుకున్న. చిన్నిని డాక్టర్‌ దగ్గరికి తీసుకుపోయిన.గంటసేపు వెయిట్‌ జేసిన తర్వాత మా వంతు వచ్చింది. డాక్టర్‌ చిన్నిని పరీక్షజేసి వైరల్‌ ఫీవర్‌ అని చెప్పిండు. ఒక సూదేసి కొన్ని మందులు రాసిచ్చిండు. తర్వాత ఇంటికి వచ్చేసినం.రెండ్రోజుల తర్వాత చిన్నికి జరం తగ్గి పోయింది. మూడో రోజు ఉదయాన్నే లేచినా. చిన్ని అప్పటికే లేచి ఆడుకుంటుంది. మాయమ్మా, నాయనా పనికి పోయినారు. లేసి చిన్ని దగ్గరకు ఎళ్లి– ‘చిన్ని! నేను,అన్న బడికి పోతే నువ్వు బుజ్జిని తీసుకొని అంగన్వాడికి పోతవా?’ అని అడిగినా.

చిన్ని నవ్వుతూ ‘పోతానన్న. మరి మనకు మధ్యానం అన్నం?’ అని అడిగింది. ‘బుజ్జికి నీకు అంగన్వాడిలో పెడతరు. నాకు రాజుగాడికి బడిలో పెడతరు అన్నం’ అని చెప్పా. మా తమ్ముడిని,చిన్న చెల్లిని ఇద్దర్ని లేపి అందరినీ రెడీ చేసి చిన్నిని, బుజ్జిని అంగన్వాడీలో వదిలిపెట్టి రాజుగాడిని నాతో పాటు బడికి తీసుకుపోయిన.   
– వల్పాపురం జీవన్, నెల్లూరు  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top